నాగార్జున సాగర్‌కు ఏపీ సొరంగం.. తెలంగాణకు తెలియకుండానే  పనులు.!

నాగార్జున సాగర్‌కు ఏపీ సొరంగం.. తెలంగాణకు తెలియకుండానే  పనులు.!

నాగార్జునసాగర్ జలాల వినియోగంపై మరోసారి తెలంగాణ,  ఏపీ మధ్య వివాదం తలెత్తే పరిస్థితి కనిపిస్తోంది. తాగునీటి ప్రాజెక్టు పేరుతో నాగార్జునసాగర్ కుడివైపు ఏపీ ప్రభుత్వం సొరంగం, పైప్‌లైన్ నిర్మాణ పనులు చేపడుతున్నట్లు సమాచారం. తెలంగాణకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఈ పనులు కొనసాగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.

సుమారు రూ.1,200 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా నాగార్జునసాగర్ డెడ్ స్టోరేజీలో ఉన్న కృష్ణా జలాలను సైతం తరలించేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది. తాగునీటి అవసరాల కోసం జల్ జీవన్ మిషన్ కింద ఈ ప్రాజెక్టును చేపడుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా రోజుకు 160 మిలియన్ లీటర్ల (ఎంఎల్‌డీ) సామర్థ్యంతో నీటి శుద్ధి ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.

సాగర్ ఏపీ వైపు దాదాపు ఏడాది కాలంగా నిర్మాణ పనులు జరుగుతోంది. తెలంగాణ సరిహద్దుకు కూతవేటు దూరంలోనే రేయింబవళ్లు పనులు కొనసాగుతున్నప్పటికీ రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులకు ఈ ప్రాజెక్టు నిర్మాణంపై సమాచారం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని నెలలుగా పనులు జరుగుతున్నా సంబంధిత అధికారులు గుర్తించలేకపోయారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మరోవైపు కృష్ణా జలాల వినియోగంపై మీటర్ల ఏర్పాటు ప్రతిపాదనలకు ఏపీ ప్రభుత్వం అంగీకరించడం లేదనే అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ద్వారా శ్రీశైలం జలాల వినియోగంపై తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో, ఇప్పుడు నాగార్జునసాగర్ వద్ద జరుగుతున్న నిర్మాణ పనులపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

తాగునీటి అవసరాల పేరుతో చేపడుతున్న ఈ ప్రాజెక్టు వల్ల నాగార్జునసాగర్ జలాల వినియోగంపై ఎలాంటి ప్రభావం పడుతుంది? డెడ్ స్టోరేజీ నీటిని తరలించేలా నిర్మాణాలు చేపడుతున్నారా? ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతులు ఏమిటి? తెలంగాణ నీటిపారుదల శాఖకు ముందస్తు సమాచారం ఉందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం, నీటిపారుదల శాఖ అధికారులు స్పందించి వాస్తవాలను వెల్లడించాల్సిన అవసరం ఉంది.