- అదనపు భూమి అర్హులైన ఇతర రైతులకు సర్దుబాటు
- సర్కారు, పోరంబోకులను పాత నక్షాలతో సరిపోల్చాలె
- సాదాబైనామా, విరాసత్ తేడాలకు కారణాలు రాయాలె
- ప్రతి రైతుకూ వ్యక్తిగతంగా ల్యాండ్ పార్సెల్ మ్యాప్
- 2,720 గ్రామాల్లో రీ సర్వే.. 416 గ్రామాల్లో పూర్తి
హైదరాబాద్, వెలుగు:రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న వ్యవసాయ, సర్కారు భూముల సమగ్ర రీ సర్వేపై రెవెన్యూ శాఖ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. రీ సర్వే కొలతల్లో ఏ రైతుకైనా పట్టాదారు పాస్ పుస్తకంలో ఉన్న విస్తీర్ణం కంటే ఎక్కువ భూమి తేలినంత మాత్రాన ‘ఆ అదనపు భూమి నాదే’ అని యాజమాన్య హక్కులు క్లెయిమ్ చేయడానికి వీల్లేదని నిబంధనల్లో తేల్చిచెప్పింది. రీ సర్వే ముగిసిన తర్వాత రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో సంబంధిత రైతులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని పేర్కొంది.
రికార్డుల కంటే ఎక్కువ భూమి ఉన్న పట్టాదారుల నుంచి ఆ అదనపు భూమిని తీసుకుని, నిబంధనల ప్రకారం అర్హత ఉండి భూమి తక్కువగా ఉండి ఇబ్బంది పడుతున్న ఇతర రైతులకు చట్టబద్ధంగా సర్దుబాటు చేయాలని ఆదేశించింది. అయితే మిస్సింగ్ ఎక్స్టెంట్, మిస్సింగ్ సర్వే నంబర్ల విషయంలో విస్తీర్ణం తక్కువగా ఉంటే పాత రికార్డుల్లోని విస్తీర్ణం ఆధారంగా సరిచూసుకోవాలని స్పష్టం చేసింది.
సర్కారు జాగలు పక్కాగా గుర్తించాలె
పాత పహాణీలు, రికార్డుల ప్రకారం ఉన్న సర్కారు భూములు, పోరంబోకు, బంచరాయి జాగల విస్తీర్ణాన్ని రీ సర్వేలో గుర్తించిన భూమితో క్షుణ్ణంగా సరిపోల్చాలని రెవెన్యూ శాఖ ఆదేశించింది. ఊళ్లలోని పాత గ్రామ నక్షాలు, రికార్డుల ఆధారంగా ప్రభుత్వ స్థలాల హద్దులు, గట్లను ఎక్కడా ఆక్రమణలకు గురికాకుండా పకడ్బందీగా గుర్తించాలని చెప్పింది. తహసీల్దార్లు క్షేత్రస్థాయి రికార్డులు, కోరిలేషన్ స్టేట్మెంట్లను సమగ్రంగా తనిఖీ చేసి నిర్ధారించుకున్న తర్వాతే రైతులకు సెక్షన్ 9(2) నోటీసులు జారీ చేయాలని తేల్చిచెప్పింది.
ఈ నోటీసులపై ఊళ్లలో రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని, సర్వే కొలతలపై సందేహాలుంటే అభ్యంతరాలు ఎలా దాఖలు చేయాలి, ఆర్డీవోకు ఎలా అప్పీల్ చేసుకోవాలో అర్థమయ్యేలా చెప్పాలని సూచించింది. సెక్షన్ 13 తుది నోటిఫికేషన్ ఇచ్చే ముందు ఆర్డీవో, అదనపు కలెక్టర్లు స్వయంగా రికార్డులను పరిశీలించి ధ్రువీకరించాలని ఆదేశించింది.
తేడాలకు కారణాలు రాయాలె
భూముల దగ్గరికి వెళ్లి క్షేత్ర తనిఖీ (గ్రౌండ్ ట్రూతింగ్) చేసినప్పుడు రికార్డులకు, వాస్తవ విస్తీర్ణానికి మధ్య తేడాలు కనిపిస్తే, ఫీల్డ్ రిజిస్టర్లో ప్రతి ఎంట్రీ దగ్గర సరైన కారణాలు నమోదు చేయాలని రెవెన్యూ శాఖ ఆదేశించింది. ముఖ్యంగా గ్రామాల్లో తెల్ల కాగితాలపై రాసుకున్న సాదాబైనామా లావాదేవీలు, ఏండ్ల తరబడి పెండింగ్లో ఉన్న విరాసత్, మ్యుటేషన్ల విషయంలో తేడాలు ఎందుకు వచ్చాయో రికార్డుల్లో స్పష్టంగా రాయాలని పేర్కొంది.
416 గ్రామాల్లో పూర్తి
రాష్ట్రంలో మొత్తం 10,954 రెవెన్యూ గ్రామాలు ఉండగా, తొలి దశలో హైదరాబాద్ మినహా 32 జిల్లాల్లో జిల్లాకు 70 గ్రామాల చొప్పున, నక్షాలు లేని గ్రామాలను కూడా కలిపి మొత్తం 2,720 గ్రామాల్లో రీ సర్వే చేపడుతున్నారు. క్షేత్రస్థాయిలో పనులు వేగంగా సాగుతుండగా, ఇప్పటివరకు వెయ్యికి పైగా గ్రామాల్లో రీ సర్వే మొదలుకాగా, అందులో 416 గ్రామాల్లో పూర్తయింది.
ప్రతి రైతుకు వ్యక్తిగత ఎల్పీఎం
రైతులకు ఇచ్చే చేను నక్షాల (ల్యాండ్ పార్సెల్ మ్యాప్ – ఎల్పీఎం) విషయంలో వివాదాలు తలెత్తకుండా సాంకేతిక జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. సాధ్యమైనంత వరకు ప్రతి రైతుకూ విడివిడిగా వ్యక్తిగత ఎల్పీఎంలు తయారు చేయాలని, అన్నదమ్ములు, ఇతరులకు కలిపి ఉమ్మడి ఎల్పీఎంలు ఇచ్చి రైతులను ఇబ్బంది పెట్టొద్దని స్పష్టం చేసింది.
గతంలో పేదలకు ప్రభుత్వం పంపిణీ చేసిన అసైన్డ్, లావణి పట్టాలను రీ సర్వేలో అత్యంత జాగ్రత్తగా పరిశీలించాలని, ఏ తేదీన ఏ రైతుకు ఎంత విస్తీర్ణం లావణి పట్టా ఇచ్చారో పక్కా వివరాలతో రికార్డుల్లో నమోదు చేయాలని సూచించింది. గ్రామంలో రీ సర్వే పనులు పూర్తయిన వెంటనే రికార్డులు, మ్యాపులు, ఖాతాల వివరాలను మండల స్థాయిలో ‘భూ భారతి’ పోర్టల్లో వంద శాతం డేటా ఎంట్రీ పూర్తి చేయాలని ఆదేశించింది.
