ఇంటర్ విలీనమైనా సిలబస్ మారదు.. ప్రస్తుత స్టూడెంట్లకు ఇదే సిలబస్‌‌‌‌ : ఇంటర్ బోర్డు

ఇంటర్  విలీనమైనా సిలబస్  మారదు.. ప్రస్తుత స్టూడెంట్లకు ఇదే సిలబస్‌‌‌‌ : ఇంటర్  బోర్డు
  •  వదంతులు నమ్మొద్దు
  •  1 నుంచి 12 దాకా ఒకే విధానానికి మద్దతు
  •  కాలేజీలకు 9, 10 కాదు.. 
  • ఒకటో తరగతి నుంచే అనుమతివ్వాలె
  •  టెన్త్ తర్వాత 16 శాతం మంది డ్రాపౌట్
  •  ఇంటర్ బోర్డు సిబ్బందికి పూర్తి రక్షణ: కేశవరావు

 
హైదరాబాద్, వెలుగు:ఇంటర్మీడియట్‌ను స్కూల్ ఎడ్యుకేషన్‌లో విలీనం చేసినా.. 11, 12 తరగతుల సిలబస్‌లో ఎలాంటి మార్పులు ఉండవని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. ఒకటి నుంచి 12వ తరగతి వరకు ఒకే విధానాన్ని అమలు చేయాలని విద్యావేత్తలు సూచించారు. ఇంటర్ కాలేజీలకు కేవలం 9, 10 తరగతులకే అనుమతులు ఇవ్వకుండా.. ఒకటో తరగతి నుంచే అనుమతించేలా విధానం ఉండాలన్నారు. విద్యార్థులు మధ్యలోనే చదువు మానేయకుండా ఎడ్యుకేషనల్ కంటిన్యుటీ కల్పించడమే లక్ష్యంగా ఈ సంస్కరణలు చేపడుతున్నట్లు ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు కే.కేశవరావు తెలిపారు.

 ఈ ప్రక్రియలో ఇంటర్ బోర్డు, కమిషనరేట్ బోధన, బోధనేతర సిబ్బంది సర్వీస్ నిబంధనలు, ప్రయోజనాలకు పూర్తి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. సోమవారం సెక్రటేరియట్‌లో కేశవరావు అధ్యక్షతన విద్యాసంస్కరణలపై విస్తృత సంప్రదింపుల సమావేశం జరిగింది. విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణా, టీజీసీహెచ్‌ఈ చైర్మన్ బాలకిష్టారెడ్డి, ఇంటర్ బోర్డు సెక్రటరీ అభిలాష అభినవ్, టీచర్ ఎమ్మెల్సీలు పింగిలి శ్రీపాల్ రెడ్డి, మల్క కొమరయ్య, ఏవీఎన్ రెడ్డి, వీసీలు, గురుకుల సొసైటీల సెక్రటరీలు, పలువురు ప్రిన్సిపల్స్ పాల్గొన్నారు.

విద్యార్థి కేంద్రంగానే డ్రాఫ్ట్

11వ తరగతి సిలబస్‌ను ఇప్పటికే నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సవరించామని, 12వ తరగతి సిలబస్ సవరణ కూడా ప్రణాళిక ప్రకారం కొనసాగుతోందని ఇంటర్ బోర్డు సెక్రటరీ అభిలాష అభినవ్ తెలిపారు. వీటికి అదనంగా కొత్తగా ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేశారు. సిలబస్ మార్పులపై వస్తున్న ఊహాగానాలు నమ్మొద్దని సూచించారు. కొత్త విధానం పూర్తిగా విద్యార్థి కేంద్రంగానే ఉంటుందని, ప్రభుత్వం ముసాయిదా మార్గదర్శకాలను సిద్ధం చేస్తోందని చెప్పారు. అధికారిక ప్రకటనలనే విశ్వసించాలని తల్లిదండ్రులు, విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యారంగ ప్రముఖులు, తల్లిదండ్రులు, విద్యార్థుల నుంచి సంస్కరణలకు సానుకూల స్పందన వస్తోందన్నారు.

పైతరగతుల అనుసంధానంపై చర్చ

విద్య కేవలం ఇంజనీరింగ్, మెడికల్ కోచింగ్‌కే పరిమితం కాకుండా విద్యార్థుల సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి దోహదపడాలని సమావేశంలో పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు. ఇంటర్ విలీనాన్ని ఏకగ్రీవంగా స్వాగతించారు. ప్రస్తుతం ఉన్న స్కూళ్లు, కాలేజీల్లోనే పై లేదా కింది తరగతులను చేర్చుకునేందుకు అవసరమైన అఫిలియేషన్ విధానాలు, పద్ధతులపై చర్చించారు. ఒకటి నుంచి 12వ తరగతి వరకు విద్యా కొనసాగింపు ఉండాలని సూచించారు. ఇంటర్ కాలేజీలకు 9, 10 తరగతులకే ప్రత్యేక అనుమతులు ఇవ్వకుండా, ఒకటో తరగతి నుంచే అనుమతులు కల్పించాలని అభిప్రాయపడ్డారు. ఉద్యోగుల సర్వీస్ అంశాలు, ప్రయోజనాలను విధాన రూపకల్పనలో సమగ్రంగా పరిగణనలోకి తీసుకుంటామని కేశవరావు భరోసా ఇచ్చారు.

డ్రాపౌట్లకు అడ్డుకట్టే లక్ష్యం

స్కూల్ ఎడ్యుకేషన్‌లో ఎలాంటి అంతరాయం లేకుండా విద్యా కొనసాగింపు కల్పించడం తక్షణ అవసరమని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా పేర్కొన్నారు. ఇంటర్ బోర్డు సెక్రటరీ సంస్కరణల ముసాయిదాపై నివేదికను సమావేశంలో వివరించారు. కేంద్ర ప్రభుత్వ యూడైస్ గణాంకాల ప్రకారం.. పదో తరగతి నుంచి 11వ తరగతి మధ్య 16 శాతానికి పైగా, 9వ తరగతి నుంచి 11వ తరగతి మధ్య 25 శాతానికి పైగా విద్యార్థులు చదువు మానేస్తున్నారని అధికారులు తెలిపారు. 

విద్యాసంస్థలు దూరంగా ఉండటం, విద్యా కొనసాగింపులో అంతరాయాల వల్ల ముఖ్యంగా బాలికలు చదువుకు దూరమవుతున్నారని గుర్తించారు. రాష్ట్రంలో పదో తరగతి బోధించే స్కూళ్లు 11 వేలకు పైగా ఉండగా, జూనియర్ కాలేజీలు కేవలం 3,500 మాత్రమే ఉన్నాయి. ఈ అంతరంతో గ్రామీణ విద్యార్థులు ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలకు వెళ్లాల్సి వస్తోందని, దీంతో తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడుతోందని అధికారులు పేర్కొన్నారు. సాధారణ జూనియర్ కాలేజీలతో పోలిస్తే సాంఘిక సంక్షేమ గురుకులాల వంటి ఇంటిగ్రేటెడ్-12 సంస్థల్లో విద్యార్థుల హాజరు, 12వ తరగతి ఉత్తీర్ణత శాతం మెరుగ్గా ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయని తెలిపారు.