- కేంద్రంపై ఏఐకేఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్ ఫైర్
- మోదీ మన దేశంలో అమెరికా సామ్రాజ్యవాదాన్ని అమలు చేస్తున్నరు
- ఢిల్లీ రైతాంగ పోరాటం సందర్భంగా ఇచ్చిన హామీలు విస్మరించారు
- దేశవ్యాప్తంగా రైతాంగ ఉద్యమాలు బలోపేతమవ్వాలని పిలుపు
హైదరాబాద్, వెలుగు: ‘దేశాన్ని లూటీ చేయ్.. కార్పొరేట్లకు దోచిపెట్టు’ అన్నట్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పాలన సాగుతోందని అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) జాతీయ ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్ విమర్శించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెబుతున్న సామ్రాజ్యవాద విధానాలన్నింటినీ మోదీ సర్కారు దేశంలో అమలు చేస్తోందని ఆరోపించారు.
నల్గొండలోని సారంపల్లి మల్లారెడ్డి నగర్ (జీఎమ్ గౌడ్ కన్వెన్షన్ హాల్), అచ్యుతానందన్ హాల్, శంకరయ్య వేదికగా జరుగుతున్న ఏఐకేఎస్ 36వ జాతీయ మహాసభల్లో సోమవారం ఆయన మాట్లడారు. అమెరికా, న్యూజిలాండ్, యూరోపియన్ యూనియన్లతో కేంద్రం చేసుకుంటున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు దేశ వ్యవసాయ రంగానికే ప్రమాదకరమని హెచ్చరించారు. 400 ఎకరాల సగటు భూమి, సబ్సిడీలు ఉండే అమెరికా రైతులతో.. ఐదెకరాల లోపు భూమి ఉన్న మన రైతులు ఎలా పోటీపడగలరని ప్రశ్నించారు. అడవుల సంరక్షణ పేరుతో ఆదివాసీలను గెంటివేస్తూ.. అంబానీ, అదానీ, జిందాల్, బిర్లా లాంటి కార్పొరేట్లకు ఖనిజ వనరులను కట్టబెడుతున్నారని మండిపడ్డారు.
దేశంలో కమ్యూనిస్టు ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లోనే భూసంస్కరణలు అమలై పేదలకు భూములు దక్కాయన్నారు. నాలుగు లేబర్ కోడ్లతో కార్మికులను కట్టుబానిసలుగా మారుస్తున్నారని, సర్ పేరుతో 14 కోట్ల మంది ఓట్లను తొలగించారని విమర్శించారు. తెలంగాణలో 20 లక్షలకుపైగా, ఏపీలో 30 లక్షలకుపైగా ఉన్న కౌలు రైతులను ఆదుకోవడంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు. దేశంలోని 342కుపైగా జిల్లాల్లో కరువు పరిస్థితులున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పైసా సాయం చేయలేదని, వీబీజీ రామ్ జీ పథకం గ్రామీణ పేదలను రోడ్డున పడేసేలా ఉందని మండిపడ్డారు.
నవంబర్ 26న దేశవ్యాప్తంగా రైతు ఉద్యమాలు: రాకేష్ టికాయత్
రైతాంగ, వ్యవసాయ కార్మిక, భూమిలేని పేదలు, ఆదివాసీ సంఘాల ఐక్య పోరాటాలతోనే కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను తిప్పికొట్టగలమని రైతు ఉద్యమ నాయకుడు రాకేష్ టికాయత్ పిలుపునిచ్చారు. దేశ రాజధాని ఢిల్లీని 13 నెలల పాటు దిగ్బంధించి మూడు నల్ల వ్యవసాయ చట్టాలను రద్దు చేయించిన రైతాంగ పోరాటం ఐక్యతకు నిదర్శనమన్నారు. నల్గొండలో జరిగిన అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభల ప్రతినిధుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
రైతాంగ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయడానికి సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. నవంబర్ 26న దేశవ్యాప్తంగా రైతాంగ ఉద్యమ కార్యక్రమాలు నిర్వహించాలని, పరిస్థితులు బట్టి మండల స్థాయిలోనూ ఆందోళనలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
పోరాట స్ఫూర్తితో కదలి రావాలి..
మోదీ సర్కారు విధానాల వల్లే రైతు ఆత్మహత్యలు పెరిగి ఐద్వా నాయకురాలు పీకే శ్రీమతి అన్నారు. ఏఐకేకేఎంఎస్ నేత శంకర్ ఘోష్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో మహిళలు ఉద్యమాల్లోకి రావాలని కోరారు. ఏఐకేఎస్కే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పురుషోత్తం శర్మ మాట్లాడుతూ నైజాంను తరిమినట్లుగానే ఐక్య పోరాటాలతో మోదీ సర్కారును గద్దె దించాలని పేర్కొన్నారు. కాగా, మహాసభల ప్రారంభ సూచికగా ఏర్పాటు చేసిన 36 జెండాల మధ్య ఏఐకేఎస్ జాతీయ అధ్యక్షుడు అశోక్ దావలే సంఘం జెండాను ఆవిష్కరించారు. అనంతరం అమరవీరుల స్తూపానికి ఆహ్వాన సంఘం అధ్యక్షుడు జూలకంటి రంగారెడ్డి, విజూ కృష్ణన్, పి.కృష్ణప్రసాద్, పోతినేని సుదర్శన్ తదితర నేతలు నివాళులర్పించారు.
