ఆర్టీసీ ఎండీగా అనిల్ కుమార్ బాధ్యతల స్వీకరణ

ఆర్టీసీ ఎండీగా అనిల్ కుమార్ బాధ్యతల స్వీకరణ
  • ఉద్యోగుల్లో ఆత్మస్థైర్యం నింపి సంస్థను బలోపేతం చేస్తాం
  • బాధ్యతలు చేపట్టిన తర్వాత అధికారులతో సమీక్ష

హైదరాబాద్, వెలుగు: ఉద్యోగుల్లో ఆత్మస్థైర్యం నింపి ఆర్టీసీని మరింత బలోపేతం చేస్తామని సంస్థ ఎండీ అనిల్ కుమార్ తెలిపారు. సోమవారం బస్ భవన్‌లో ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఉద్యోగుల సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమన్నారు.

ప్రయాణికులకు మరింత సురక్షితమైన, సౌకర్యవంతమైన, నాణ్యమైన సేవలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తామని చెప్పారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ప్రయాణికుల ఆదరణ పొందేలా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. దేశంలోనే అగ్రగామి ప్రజా రవాణా వ్యవస్థగా ఆర్టీసీ గుర్తింపు సాధించేలా ప్రతి ఉద్యోగి, అధికారి బాధ్యతతో పనిచేయాలని కోరారు.