బిల్కిస్ బానో కేసు దోషులకు బెయిల్‌‌‌‌.. ఇద్దరికి జీవిత ఖైదు నిలిపివేసిన సుప్రీం కోర్టు

బిల్కిస్ బానో కేసు దోషులకు బెయిల్‌‌‌‌.. ఇద్దరికి జీవిత ఖైదు నిలిపివేసిన సుప్రీం కోర్టు
  • వెంటనే రిలీజ్​చేయాలని ఆదేశం
  • 17 ఏండ్లు జైల్లో ఉన్న రేపిస్టులు 

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో కేసులో ఇద్దరు దోషులకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 17 ఏండ్లకు పైగా జైలు శిక్ష అనుభవించినందున బిపిన్‌‌‌‌‌‌‌‌చంద్ జోషి, ప్రదీప్ మోధియాల జీవిత ఖైదును నిలిపివేసింది. 2017 మేలో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ వీరు దాఖలు చేసిన పిటిషన్‌‌‌‌‌‌‌‌లో న్యాయపరమైన, వాస్తవ అంశాలను పరిశీలించాల్సి ఉందని కోర్టు పేర్కొంది. అలాగే పిటిషనర్లలో ఒకరైన జోషి తీవ్రమైన శారీరక వైకల్యంతో బాధపడుతున్నారని కూడా కోర్టు నోట్ చేసింది. వారిని వెంటనే విడుదల చేయాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. 

విచారణ సందర్భంగా ప్రభుత్వం తరపున న్యాయవాది బెయిల్ పిటిషన్‌‌‌‌‌‌‌‌ను వ్యతిరేకించారు. నేరాల తీవ్రత, ట్రయల్ కోర్టు, హైకోర్టు ఇచ్చిన ఏకాభిప్రాయ తీర్పులను ఆయన ప్రస్తావించారు. అయితే, దోషుల తరఫు న్యాయవాది వాదిస్తూ.. ప్రాథమిక ఎఫ్ఐఆర్​లో పిటిషనర్లలో ఒకరి పేరు లేదని, ఘటన జరిగిన దాదాపు మూడేళ్ల తర్వాత కేసులో ఇరికించారని తెలిపారు. అత్యాచార ఆరోపణలపై బాధితురాలు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో గానీ, వైద్య పరీక్షల సమయంలో డాక్టర్ ముందు ఇచ్చిన స్టేట్​మెంట్​లోనూ వీరిద్దరి పేర్లను చెప్పలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. గుంపులో ఉన్నారనే ఆరోపణ తప్ప, వారు నేరుగా నేరంలో పాల్గొన్నట్లు ఆధారాలు లేవన్నారు. ఈ పిటిషన్‌‌‌‌‌‌‌‌పై సుప్రీంకోర్టు ఈ ఏడాది మార్చిలో నోటీసులు జారీ చేసింది.

కేసు నేపథ్యం

2022 ఆగస్టులో గుజరాత్ ప్రభుత్వం సత్ప్రవర్తన కారణం చూపి ఈ కేసులో 11 మంది దోషులను ముందస్తు విడుదల చేసింది. వారిలో బిపిన్‌‌‌‌‌‌‌‌చంద్ జోషి, ప్రదీప్ రామన్‌‌‌‌‌‌‌‌లాల్ కూడా ఉన్నారు. దీనిని సవాలు చేస్తూ బిల్కిస్ బానో సుప్రీంకోర్టును ఆశ్రయించగా, 2024 జనవరిలో కోర్టు ఆ విడుదలను రద్దు చేసింది. శిక్ష తగ్గించే (రెమిషన్) అధికారం గుజరాత్ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేస్తూ, దోషులందరూ రెండు వారాల్లోగా సరెండర్​ అవ్వాలని ఆదేశించడంతో వారు తిరిగి జైలుకు వెళ్లారు.

 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానో సామూహిక అత్యాచారానికి గురయ్యారు. అప్పుడు ఆమె వయసు 21 ఏండ్లు, అంతేగాక ఐదు నెలల గర్భంతో ఉన్నారు. ఆ సమయంలో ఆమె మూడేండ్ల కుమార్తెతో సహా కుటుంబంలోని ఏడుగురు హత్యకు గురయ్యారు.