న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన తల్లిదండ్రులు రాజీవ్ గాంధీ, సోనియా గాంధీల మధ్య ఉన్న అన్యోన్యతను, తన చిన్ననాటి మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు. బిలాంగింగ్ ఎ జర్నీ ఆఫ్ లవ్ పేరుతో సోనియా గాంధీ తన ఆత్మకథ రాసిన విషయం తెలిసిందే. 2026, నవంబర్ 10న సోనియా మెమోయిర్ దేశవ్యాప్తంగా విడుదలైంది. దీని అధికారిక పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం (నవంబర్ 16) న్యూఢిల్లీలో జరిగింది. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. తన చిన్నతనంలో ఇంట్లో మధ్యాహ్న, రాత్రి భోజన సమయాల్లో తన తండ్రి రాజీవ్ గాంధీ ఒడిలోనే తన తల్లి సోనియా గాంధీ కూర్చునేవారని చెప్పారు.
ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు అలాగే ఉంటారని తాను అనుకునేవాడినని.. కానీ ఒకసారి తన స్నేహితుడి ఇంటికి వెళ్లినప్పుడు అక్కడ వాళ్ల అమ్మ నాన్న ఒడిలో కూర్చోకపోవడం చూసి మీ అమ్మ ఎందుకు మీ నాన్న ఒడిలో కూర్చోలేదని అమాయకంగా అడిగినట్లు రాహుల్ నవ్వుతూ చెప్పారు. రాజీవ్, సోనియాల మధ్య ఉన్న ఆ అసాధారణ ప్రేమను తాను మరే ఇతర ఇంట్లోనూ చూడలేదని, నాన్న అమ్మకు, అమ్మ నాన్నకు పూర్తిగా అంకితమయ్యారని పేర్కొన్నారు.
ఒకే ఒక్కసారి చూశాం..
తనకు ఊహ తెలిసినప్పటి నుంచి తన తల్లిదండ్రులు కేవలం ఒకే ఒక్కసారి గొడవ పడటం చూశామని రాహుల్ గాంధీ తెలిపారు. ఆ రోజు మా నాన్న రాజీవ్ గాంధీ పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్తో ఫోన్లో మాట్లాడుతున్నారు. అదే సమయంలో మా అమ్మ ఏదో ముఖ్యమైన విషయం చెప్పడానికి డాడీని మూడు నాలుగు సార్లు పిలిచారు. పని ఒత్తిడిలో ఉన్న రాజీవ్ అప్పుడు కాస్త అసహనంతో గట్టిగా అరవడంతో వారి మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది. సోదరి ప్రియాంక, తాను తమ తల్లిదండ్రుల మధ్య చూసిన ఏకైక గొడవ ఇదేనని రాహుల్ గుర్తు చేశారు. బయటి ప్రపంచం సోనియా ఎక్కువగా మాట్లాడదు సైలెంట్ అనుకుంటారని.. కానీ నిజానికి ఆమె అందరితో కలివిడిగా ఉండే వ్యక్తి అని అన్నారు.
►ALSO READ | ఆత్మకథ రాయడానికి అసలు కారణమేంటో రివీల్ చేసిన సోనియా
వరుస ఘటనలతో అమ్మ జీవితంలో విషాదం:
తమ కుటుంబానికి జరిగిన వరుస నష్టాలతో అమ్మ జీవితం విషాదంగా మారిందని రాహుల్ తెలిపారు. 1984లో నానమ్మ ఇందిరా గాంధీ, ఆ తర్వాత 1991లో తండ్రి రాజీవ్ గాంధీ హత్యకు గురికావడంతో తమ కుటుంబం కుప్పకూలిపోయిందని చెప్పారు. నాన్న మరణం తర్వాత ఎప్పుడూ నవ్వుతూ సరదాగా ఉండే తన తల్లి పూర్తిగా మారిపోయారని, ఆమె జీవితంలోని వెలుగు ఆరిపోయి కొత్త ప్రయాణం మొదలైందని ఆయన భావోద్వేగంతో గుర్తుచేసుకున్నారు.
