చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఆగి ఉన్న రైల్లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు

చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఆగి ఉన్న రైల్లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు

హైదరాబాద్: చరపల్లి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ఒక రైలు బోగీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో స్టేషన్‎లోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు, రైల్వే పోలీసులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దీంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

చర్లపల్లిలో అగ్నిప్రమాద ఘటనపై దక్షిణ మధ్య రైల్వే శాఖ క్లారిటీ ఇచ్చింది. సోమవారం (నవంబర్ 16)సాయంత్రం 6.30 గంటల సమయంలో ప్లాట్‎ఫామ్ 5-6 మధ్య ఉన్న ఖాళీ కోచ్‎లో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు తెలిపింది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను అదుపు చేసినట్లు పేర్కొంది. 

ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపింది. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోన్నట్లు వెల్లడించింది. ఈ ప్రమాదంతో రైళ్ల రాకపోకలకు కాసేపు అంతరాయం కలిగింది. పరిస్థితి అదుపులోకి రావడంతో చర్లపల్లి స్టేషన్ గుండా రైలు ప్రయాణాలు యధావిధిగా సాగుతున్నాయి.