- కొల్లూరు డబుల్ బెడ్‌రూమ్ కాలనీ ఖాళీ
- 120 బ్లాకుల్లో 18 వేల డబుల్ బెడ్ రూమ్స్నిర్మాణం
- కరెంట్ బిల్లుల ఆధారంగా లెక్క తీసిన అధికారులు
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్లు లబ్ధిదారులు లేక ఖాళీగా దర్శనమిస్తున్నాయి. పటాన్‌చెరు పరిధిలోని కొల్లూరులో డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను గత బీఆర్ఎస్ పాలకులు నిర్మించారు. వీటిని హైదరాబాద్‌లో నివసించే వివిధ నియోజకవర్గాల పేదలకు కేటాయించారు. అయితే, అవి పేదలు నివాసం ఉంటున్న ప్రాంతానికి దూరంగా ఉండటం, ఉపాధి దొరకదన్న ఉద్దేశంతో లబ్ధిదారులు అక్కడ ఉండటం లేదు. దీంతో ఆ ఫ్లాట్లు ఎక్కువ శాతం ఖాళీగానే ఉంటున్నాయి.
ఆసియాలోనే అతిపెద్ద డబుల్ బెడ్‌రూమ్ టౌన్‌షిప్
ఆసియాలోనే అతిపెద్ద డబుల్ బెడ్‌రూమ్ టౌన్‌షిప్‌ను కొల్లూరులో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించింది. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం కొల్లూరు పరిధిలో 120 బ్లాకుల్లో సుమారు 18 వేల డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్లను నిర్మించింది. ఈ టౌన్‌షిప్‌లో వేలాది ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయన్న ఫిర్యాదులతో హౌసింగ్ అధికారులు సర్వే చేపట్టారు. టౌన్‌షిప్‌లోని ప్రతి ఫ్లాట్ కరెంట్ మీటర్ రీడింగులు, నెలవారీ బిల్లులను పరిశీలించగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. కొన్ని ఫ్లాట్లకు కనీస సర్వీస్ చార్జ్ మినహా యూనిట్ విద్యుత్ కూడా ఖర్చు కాలేదు. ఇండ్లలో కుటుంబాలు నివసించడం లేదని, తాళాలు వేసి వదిలేశారని అధికారులు స్పష్టం చేశారు. అందులో సుమారు 10 వేల ఇండ్లలో ఇప్పటికీ ఎవరూ నివాసం ఉండటం లేదని సర్వేలో తేలింది. మొత్తం 18 వేల ఫ్లాట్లు ఉండగా, 10 వేల మంది నివాసం ఉండటం లేదని బయటపడింది.
ప్లానింగ్ లేదు.. ఉపాధి లేదు..!
నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న పేదలను ఒకేచోటకు చేర్చాలన్న ఆలోచనతో కొల్లూరులో భారీ ఎత్తున 120 బ్లాకుల్లో ఈ టౌన్‌షిప్‌ను నిర్మించారు. హైదరాబాద్ సిటీలోని నాంపల్లి, చార్మినార్, చాంద్రాయణగుట్ట ఇలా అన్ని నియోజకవర్గాల పేదలకు కొల్లూరులో డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్లను కేటాయించారు. సిటీకి సుమారు 30 నుంచి 40 కిలోమీటర్ల దూరంలో టౌన్‌షిప్ ఉండటం, స్థానికంగా ఎలాంటి పరిశ్రమలు, పనులు లేకపోవడం లబ్ధిదారులకు శాపంగా మారింది. సిటీకి వచ్చి రోజువారీ పనులు చేసుకోవాలంటే ఆర్టీసీ బస్సు సర్వీసులు సరిపడా లేవు. సిటీకి వచ్చిపోవాలంటే రోజంతా ప్రయాణానికే సరిపోతుండటంతో లబ్ధిదారులు అక్కడ ఉండటానికి వెనకాడుతున్నారు.
అక్కడ ఉండనోళ్ల పట్టాలు రద్దు..!
కొల్లూరు డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లకు తాళాలు వేసిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు హౌసింగ్ శాఖ సిద్ధమైంది. నిబంధనల ప్రకారం ఇల్లు అలాట్ అయ్యి అక్కడ ఉండని వారి పట్టాలు రద్దు చేయాలని భావిస్తోంది. డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్లుకు 3 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పేదలకు ఫ్లాట్లు కేటాయించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇండ్లు లేని పేదలు 5 కిలోమీటర్ల పరిధిలో సుమారు 15 వేల మంది ఉన్నారని అధికారులు చెబుతున్నారు. ఫ్లాట్లలో ఉండనివారి పట్టాలు రద్దు చేసి ఇల్లు లేని పేదలకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేశారు. ఇల్లులేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద రీ-అలాట్ చేసేందుకు హౌసింగ్ శాఖ ప్రణాళికలు రూపొందించింది.
అక్రమంగా అద్దెల దందా..
ఇండ్లు దక్కించుకున్న పలువురు లబ్ధిదారులు అటు వైపే చూడడం లేదు. మరికొందరు బయటి వ్యక్తులకు అక్రమంగా అద్దెలకు ఇచ్చినట్లు అధికారుల సర్వేలో తేలింది. సరైన ప్రణాళిక లేకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టును హడావుడిగా ప్రారంభించింది. ఫలితంగా కోట్లాది రూపాయల ప్రజాధనం నిరుపయోగంగా మారిపోయింద
