గుడ్డుకు రెక్కలు! హోల్ సేల్ వందపైనే.. రిటైల్లో ఒక్కో గుడ్డు రూ. 9

గుడ్డుకు రెక్కలు! హోల్ సేల్ వందపైనే..  రిటైల్లో ఒక్కో గుడ్డు రూ. 9
  • ఎల్నినో, ఇథనాల్తో దాణా కొరత..
  • దాణా ధర పెరగడంతో రేట్లు హైక్
  • ఆగస్టులో డజన్​ రూ.80.. ఇప్పుడు రూ.90–108
  • చలికాలం కావడంతో మరింత పెరిగిన డిమాండ్

హైదరాబాద్ సిటీ, వెలుగు: నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు కోడిగుడ్ల ధరలు భారంగా మారాయి. కొంతకాలం స్థిరంగా ఉన్న ధరలు మళ్లీ పెరిగాయి. ప్రస్తుతం రిటైల్ మార్కెట్‌‌లో నాణ్యత, ప్రాంతాన్ని బట్టి ఒక్కో గుడ్డు రూ.7.50 నుంచి రూ.9 వరకు అమ్ముతున్నారు. దీంతో డజను ధర రూ.90 నుంచి రూ.108 వరకు పలుకుతోంది. ఆగస్టులో డజను గుడ్ల ధర రూ.80 ఉండగా, ఒక్కో గుడ్డు రూ.6.50 నుంచి రూ.7 వరకు లభించింది. టోకు మార్కెట్‌‌లోనూ డజను ధర రూ.90 నుంచి రూ.96 వరకు ఉంది.

దాణా ఖర్చులే ప్రధాన కారణం..

కోళ్ల పెంపకంలో కీలకమైన మక్కజొన్న, నూకల ధరలు పెరగడం గుడ్ల ధరలపై ప్రభావం చూపుతోంది. గతంలో కిలో మక్కజొన్న రూ.18 నుంచి రూ.22 ఉండగా, ప్రస్తుతం రూ.32 నుంచి రూ.34కు చేరింది. నూకల ధర కూడా రూ.14 నుంచి-15, రూ.31- నుంచి 32కు పెరిగింది. ఎల్‌‌నినో ప్రభావం, వర్షాభావంతో మక్కజొన్న దిగుబడి తగ్గడం, ఇథనాల్ ఉత్పత్తికి మక్కజొన్న వినియోగం పెరగడం వల్ల పౌల్ట్రీ రంగంలో దాణా కొరత ఏర్పడింది. చలికాలం ప్రారంభం కావడంతో గుడ్లకు డిమాండ్ పెరిగి ధరలు ఎగబాకాయి.

హైదరాబాద్‌‌లో రోజుకు 1.2 కోట్ల అమ్మకాలు.. 

రాష్ట్రంలో రోజుకు సుమారు 3.8 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. ఇందులో 2 కోట్ల గుడ్లు రాష్ట్రంలోనే వినియోగమవుతుండగా, మరో 1.8 కోట్లు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలకు సరఫరా అవుతున్నాయి. హైదరాబాద్‌‌లో హోటళ్లు, బేకరీలు, హాస్టళ్లు, ఇళ్లలో కలిపి రోజుకు కోటి నుంచి 1.2 కోట్లకు పైగా గుడ్లు అమ్ముడవుతున్నాయి.

కుటుంబాలపై అదనపు భారం.. 

నలుగురు సభ్యులున్న మిడిల్​ క్లాస్​ ఫ్యామిలీ నెలకు కనీసం 3–4 డజన్ల గుడ్లు వినియోగిస్తుంది. డజనుపై రూ.15 నుంచి రూ.25 అదనంగా చెల్లించాల్సి రావడంతో రూ.60 నుంచి రూ.100 వరకు భారం పెరుగుతోంది. సిటీలో రోజువారీ గుడ్ల వాడకంపై కూడా ధరల పెరుగుదల ప్రభావం పడుతోంది. డిసెంబర్, జనవరిలో చలి తీవ్రత, బేకరీ ఉత్పత్తుల వినియోగం పెరిగితే గుడ్ల రేట్లు మరో 25–30% పెరిగే చాన్స్​ ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం/ పౌల్ట్రీ బోర్డు దాణా సబ్సిడీ వంటి చర్యలు చేపడితేనే ధరల నియంత్రణకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు.