భారతీయుల ఆరాధ్య ఇతిహాసం రామాయణం.. తరతరాలుగా ఎన్నో రూపాల్లో, ఎన్నో కథనాల్లో ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన మహాకావ్యం. అలాంటి రామాయణాన్ని వెండితెరపై మరోసారి ఆవిష్కరిస్తూ దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కించిన ‘రామాయణ: రైజ్ ఆఫ్ ఏ లెజెండ్’ ఇప్పుడు బాక్సాఫీస్ వద్దే కాదు.. సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా సీత పాత్రలో సాయిపల్లవిని యోధురాలిగా, చేతిలో ఖడ్గం పట్టి రాక్షసులతో పోరాడే వీరనారిగా చూపించడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కొందరు ఈ కొత్త ఆవిష్కరణను స్వాగతిస్తుంటే.. మరికొందరు సంప్రదాయ రామాయణానికి భిన్నంగా ఉందంటూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదంపై తాజాగా దర్శకుడు నితేశ్ తివారీ స్పందిస్తూ తన నిర్ణయం వెనుక ఉన్న పురాణ ఆధారాలను వెల్లడించారు. దీంతో ‘వారియర్ సీత’ చుట్టూ సాగుతున్న చర్చ మరోసారి ఆసక్తికరంగా మారింది.
సీతను యోధురాలిగా చూపించడానికి కారణం అదే!
సాయిపల్లవి సీత పాత్రలో పోరాట సన్నివేశాల్లో కనిపించడంపై వస్తున్న విమర్శలకు నితేశ్ తివారీ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ‘ది ఫెడరల్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. సీతను కేవలం కష్టాలను భరించే మహిళగా కాకుండా, అపారమైన శక్తికి ప్రతిరూపంగా, అవసరమైనప్పుడు దుష్టశక్తులను ఎదుర్కొనే యోధురాలిగా చిత్రీకరించడానికి భారతీయ ఇతిహాసాల్లోనే ఆధారాలు ఉన్నాయని వివరించారు.
ముఖ్యంగా సంస్కృతంలోని ‘అద్భుత రామాయణం’, 15వ శతాబ్దానికి చెందిన ఒడియా ‘బిలంక రామాయణం’లో సీత పాత్ర సంప్రదాయంగా చాలామంది చూసిన రూపానికి భిన్నంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కథనాల్లో సీత కేవలం సహనానికి, త్యాగానికి ప్రతీక మాత్రమే కాదని.. క్రియాశీలకంగా దుష్టశక్తులతో పోరాడే యోధురాలని, విశ్వశక్తి స్వరూపిణి అని వివరించారు.
FINALLY #Ramayana Director Nitesh Tiwari Breaks Silence On Depicting #SaiPallavi 's Sita As A Warrior 🚨🚨🚨 He stated that his version of Goddess Sita is based on other versions of Ramayan - the Sanskrit Adbhuta Ramayana and the 15th-century Odia Bilanka Ramayana. "These tellings offer a rather different image of Sita: not merely a figure of endurance but an active warrior and an embodiment of cosmic Shakti." He added that the above versions mention Sita assuming the fierce form of Mahakali and slaying thousand-headed demong king Sahasra King when Lord Rama incapacitated. Nitesh added that a 'warrior Sita' is not necessarily an invetion of contemporary feminisim, 'but a character with precedents in India's diverse epic traditions'.
— Always Bollywood (@AlwaysBollywood) November 15, 2026
రాముడే నిస్సహాయుడైతే.. మహాకాళిగా మారిన సీత!
నితేశ్ తివారీ ప్రస్తావించిన అంశాల్లో అత్యంత ఆసక్తికరమైనది సహస్ర రావణుడి కథ. కొన్ని రామాయణ కథనాల ప్రకారం.. రావణుడికంటే అత్యంత శక్తిమంతుడైన వెయ్యి తలల సహస్ర రావణుడితో యుద్ధం చేసే సమయంలో శ్రీరాముడు సైతం నిస్సహాయ స్థితికి చేరుకుంటాడు. అప్పుడు సీత తన అసలైన దివ్యశక్తిని ఆవిష్కరిస్తూ మహాకాళి రూపాన్ని ధరించి ఆ రాక్షసుడిని సంహరిస్తుంది.
ఈ ఘట్టాన్ని ప్రస్తావిస్తూ.. సీతలోని యోధురాలి కోణం ఆధునిక కాలంలో సృష్టించిన కొత్త ఆలోచన కాదని, భారతీయ రామాయణ సంప్రదాయాల్లోనే అలాంటి కథనాలు ఉన్నాయని దర్శకుడు స్పష్టం చేశారు. అందుకే తమ సినిమాలో సీతను ఆ రూపంలో చూపించడం వెనుక నిర్దిష్టమైన సాహిత్య ఆధారాలు ఉన్నాయని ఆయన వివరణ ఇచ్చారు.
‘సీత నిస్సహాయురాలు కాదు!’: నటి లారా దత్తా
సీత పాత్రపై వస్తున్న విమర్శలను నటి లారా దత్తా ఖండించారు. రాజకుటుంబాల్లోని యువరాజులు, యువరాణులకు అప్పట్లోనే ఆయుధ విద్యలో శిక్షణ ఇచ్చేవారని.. అలాంటప్పుడు సీతకు యుద్ధ విద్య తెలిసి ఉండటంలో ఆశ్చర్యం ఏముందని ప్రశ్నించారు. అరణ్యవాసంలో ఎదురయ్యే ప్రమాదాలను ఎదుర్కొనేందుకు సీత సిద్ధంగా ఉండటంలో తప్పేమీ లేదని పేర్కొన్నారు. మహిళను నిస్సహాయురాలిగా చూడకూడదని, ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఒక సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌గా ఆస్వాదించాలని సూచించారు.
‘సీత యోధురాలు కాదు!’: ముకేశ్ ఖన్నా అభ్యంతరం..
మరోవైపు నటుడు ముకేశ్ ఖన్నా మాత్రం సీత యాక్షన్ సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను చదివిన వాల్మీకి రామాయణంలో సీత యుద్ధం చేసినట్లు ఎక్కడా లేదని పేర్కొన్నారు. సీతను ఝాన్సీ లక్ష్మీబాయిలా ఖడ్గం పట్టి పోరాడే యోధురాలిగా చూపించడం తనకు నచ్చలేదన్నారు. ఇతిహాసాలను తెరకెక్కించేటప్పుడు సృజనాత్మక స్వేచ్ఛ పేరుతో అసలు కథనానికి భిన్నంగా వెళ్లకూడదని అభిప్రాయపడ్డారు. అయితే ఈ విమర్శలు చేస్తున్న సమయంలో తాను సినిమాను పూర్తిగా చూడలేదని కూడా స్పష్టం చేశారు.
దీపికా చిఖ్లియా ఏమన్నారంటే?
1987 రామాయణంలో సీతగా గుర్తింపు పొందిన నటి దీపికా చిఖ్లియా కూడా ఈ వివాదంపై స్పందించారు. తాను చదివిన వాల్మీకి రామాయణం, రామచరితమానస్‌లో సీత యుద్ధం చేసినట్లు లేదన్నారు. అయితే దేశంలో 300కు పైగా రామాయణ కథనాలు ఉన్నాయని, ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధమైన కథనం ప్రాచుర్యంలో ఉందని గుర్తుచేశారు. సినిమా బృందం మరో రామాయణ వెర్షన్ ఆధారంగా ఈ సన్నివేశాలను రూపొందించి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.
సాయిపల్లవి ప్రత్యేక శిక్షణ..
సీత పాత్రలో సహజంగా కనిపించేందుకు సాయిపల్లవి కూడా ప్రత్యేకంగా కత్తిసాము, పోరాట విద్యల్లో శిక్షణ తీసుకున్నట్లు గత ఇంటర్వ్యూల్లో వెల్లడించారు. ఈ యాక్షన్ సన్నివేశాలను సాధారణ పోరాటాల్లా కాకుండా.. ఒక రాజకుమారి కదలికల్లో ఉండే సౌందర్యం, నృత్యరీతిని ప్రతిబింబించేలా రూపొందించేందుకు స్టంట్ టీమ్ కృషి చేసిందని ఆమె తెలిపారు. తన తరానికి సీత పాత్రలోని మరో కోణాన్ని పరిచయం చేయడం ఆసక్తికరమైన అనుభవమని పేర్కొన్నారు.
రెండో భాగంపై భారీ అంచనాలు!
రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్ రావణుడిగా, రవీ దూబే లక్ష్మణుడిగా నటించిన ఈ రెండు భాగాల చిత్రంలో మొదటి భాగం నవంబర్ 5న విడుదలైంది. రెండో భాగం 2028లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మొత్తానికి ‘వారియర్ సీత’ పాత్ర చుట్టూ మొదలైన ఈ వివాదం రామాయణంలోని భిన్న కథనాలు, సంప్రదాయాలపై మరోసారి చర్చకు తెరలేపింది. మరి సాయిపల్లవి యోధురాలి అవతారం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుంది? రెండో భాగంలో సీత పాత్రను దర్శకుడు ఎలా ఆవిష్కరిస్తారు? అన్నది ఆసక్తికరంగా మారింది.
Two souls, one eternal bond. 🏹 Experience the sacred union of Rama and Sita in Ramayana. Book your tickets now! Ramayana, now playing in cinemas worldwide, across all premium formats. https://t.co/cTKxxg6NUI
— The World Of Ramayana (@WorldOfRamayana) November 10, 2026
