సాధారణంగా రైలు లో ప్రయాణం చేయాలంటే టికెట్ కొనుగోలు తప్పనిసరి.. రైల్వే స్టేషన్ లో పికప్ కోసం వెళ్లినా ప్లాట్ ఫాం టికెట్ కూడా కొనాల్సిందే.. అయితే కొందరు రైల్వే టికెట్లు కొనుగోలు చేయకుండానే ప్రయాణం చేస్తున్నారు. ముఖ్యంగా పండుగ సందర్భాల్లో చాలా మంది టికెట్ లేని ప్రయాణం చేస్తున్నారని తాజా రైల్వే శాఖ లెక్కలు చెబుతున్నాయి. ఈ ఏడాది దీపావళి పండుగ సీజన్ లో ఒక్క వెస్టర్న్ రైల్వే పరిధిలోని ముంబైలో దాదాపు లక్ష మంది టికెట్ లేని ప్రయాణం చేయాలని ప్రయత్నించి అధికారులకు పట్టబడ్డారట.. కేవలం పదిహేను రోెజుల్లో ముంబైలోని రైల్వే స్టేషన్లల్లో టికెట్ లేకుండా ప్రయాణించి 95 వేల మంది అధికారులకు చిక్కడంతో.. వెస్టర్న్ రైల్వేకు రూ. 8.23కోట్లు జరిమానా ఆదాయం వచ్చింది స్వయంగా వెస్టర్న్ రైల్వే శాఖ ప్రకటించింది. వివరాల్లోకి వెళితే..
ముంబై: వెస్టర్న్ రైల్వే ముంబై సెంట్రల్ డివిజన్ నిర్వహించిన ప్రత్యేక టికెట్ చెకింగ్ డ్రైవ్‌లో 15 రోజల్లో 94వేల 919 అక్రమ ప్రయాణ కేసులు నమోదయ్యాయి. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 14 వరకు జరిగిన ఈ డ్రైవ్‌లో రూ.8కోట్ల22లక్షల 99వేల300 జరిమానా వసూలైంది.
'ఆపరేషన్ డీప్' పేరుతో నిర్వహించిన ఈ క్యాంపెయిన్‌లో వసూళ్లు నిర్ధారిత టార్గెట్ రూ.7కోట్ల 65లక్షల 41వేల869 కంటే 7.52 శాతం అధికంగా నమోదయ్యాయి. అంటే టార్గెట్ కంటే దాదాపు రూ.57.57 లక్షలు అదనంగా వచ్చాయని రైల్వేశాఖ తెలిపింది.
గతేడాది దివాళీ సమయంలో వసూళ్లు రూ.5.36 కోట్లుగా ఉన్నాయి. ఈసారి అది రూ.8.23 కోట్లకు చేరుకోవడంతో ఏడాది వ్యవధిలో దాదాపు రూ.2.87 కోట్ల పెరుగుదల నమోదైంది. శాతాల పరంగా చూస్తే ఇది 53.6 శాతం అధికం.
పండుగ సీజన్‌లో సబర్బన్, లాంగ్ డిస్టెన్స్ ట్రైన్లలో పాసెంజర్ల సంఖ్య గణనీయంగా పెరగడంతో అక్రమ ప్రయాణాలు అదుపులో ఉంచేందుకు ఈ డ్రైవ్ నిర్వహించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. చెకింగ్ సిబ్బంది, సూపర్‌వైజర్లు,సంబంధిత విభాగాల సమన్వయంతో ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని చెప్పారు.
అయితే కేవలం 15 రోజుల్లో దాదాపు 95వేల 000 కేసులు నమోదు కావడం పండుగ సమయంలో అక్రమ ప్రయాణాల తీవ్రతను స్పష్టంగా చూపిస్తోంది. టికెట్ లేకుండా ప్రయాణించడంతో రైల్వేకు రెవెన్యూ నష్టం జరుగుతుందని, ముఖ్యంగా రష్ పీరియడ్‌లో ఇది మరిన్ని సమస్యలకు దారితీస్తుందని అధికారులు చెబుతున్నారు.
