జగిత్యాలలో 13వేల193 నూతన చేయూత పింఛన్లు.. మంజూరు పత్రాలు అందజేసిన మంత్రి అడ్లూరి

జగిత్యాలలో 13వేల193 నూతన చేయూత పింఛన్లు.. మంజూరు పత్రాలు అందజేసిన మంత్రి అడ్లూరి

జగిత్యాల జిల్లాలో నూతన చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పాల్గొని లబ్ధిదారులకు పింఛన్ మంజూరు పత్రాలను అందజేశారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 13వేల193 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలను మంత్రి పంపిణీ చేశారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు.  తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. పెండింగ్ లో పింఛన్లకు అర్హత దరఖాస్తులను పరిశీలించేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్లో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ పేదల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు మంత్రి అడ్లూరి. అర్హులకు రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ల పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి 3వేల500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి నిర్మాణాలు చేపడుతున్నామని, ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. 

పింఛన్లు ఆర్థిక భరోసా: ఎమ్మెల్యే సంజయ్ కుమార్

ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సామాజిక భద్రతకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఒంటరి మహిళలు, భర్తను కోల్పోయిన మహిళలు, దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులకు పింఛన్లు ఆర్థిక భరోసాగా నిలుస్తాయన్నారు. 

కేంద్ర ప్రభుత్వం అందించే పింఛన్ వాటా తక్కువగా ఉందని, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చేనేత కార్మికులు తదితర వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వమే పింఛన్ మొత్తాన్ని భరిస్తోందని తెలిపారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం పంపిణీ, ఉచిత విద్యుత్ వంటి పథకాలతో ప్రభుత్వం ప్రజలకు అండగా నిలుస్తోందన్నారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్? 

జగిత్యాల జిల్లాలో 13వేల 193 మంది లబ్ధిదారులకు నూతన పింఛన్ల మంజూరు పత్రాలు అందడంతో ఆయా కుటుంబాలకు సామాజిక భద్రత మరింత బలోపేతం కానుంది.