విద్యార్థులకు రైల్వే శాఖ ప్రత్యేక రాయితీ సౌకర్యాన్ని అందిస్తోంది. బాలురు ఇంటర్మీడియట్ వరకు, బాలికలు డిగ్రీ వరకు ప్యాసింజర్ రైళ్లలో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తోంది. అయితే ఈ సదుపాయం సెకండ్ క్లాస్ కోచ్‌లకు మాత్రమే వర్తిస్తుంది. విద్యార్థులు తమ ఇంటి నుంచి చదువుకునే విద్యాసంస్థకు 150 కిలోమీటర్ల పరిధిలో ప్రయాణించేందుకు ఈ వెసులుబాటు ఉంటుంది.
ఈ రాయితీని పొందాలనుకునే విద్యార్థులు సమీప రైల్వే స్టేషన్‌లోని టికెట్ కౌంటర్‌ను సంప్రదించాలి. అక్కడ తమ విద్యాసంస్థ గుర్తింపు కార్డు (ఐడీ), ఫొటో సమర్పించి మంత్లీ సీజన్ టికెట్ (MST) పొందవచ్చు. ఈ టికెట్ ద్వారా నిర్ణీత కాలపరిమితిలో ఉచితంగా ప్రయాణించేందుకు వీలుంటుంది.
విద్యార్థులకు సాధారణ ప్రయాణంతో పాటు మరికొన్ని సందర్భాల్లోనూ రైల్వే శాఖ రాయితీలు కల్పిస్తోంది. విద్యా సంస్థలు నిర్వహించే పర్యటనలు (ఎడ్యుకేషనల్ టూర్లు), పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు కూడా నిబంధనల ప్రకారం టికెట్ ధరల్లో రాయితీ లభిస్తుంది. ఈ సౌకర్యాలను అర్హులైన విద్యార్థులు వినియోగించుకోవచ్చు.
