ముంబైలోని ఛత్రపతి శివా జీ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపులు కలకలం రేపాయి.శనివారం (నవంబర్ 15) సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తి స్టేషన్ లో బాంబు పెట్టినట్లు ఫోన్ చేయడంతో రైల్వే పోలీసులు, ముంబై పోలీసులు అప్రమత్తమయ్యాయి. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), ప్రభుత్వ రైల్వే పోలీసులు (GRP), ముంబై పోలీసులతో పాటు ఇతర భద్రతా విభాగాల సిబ్బంది , డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దింగి విస్తృతంగా తనిఖీలు చేశారు. స్టేషన్‌లోని సబర్బన్, దూరప్రాంత రైళ్ల ప్లాట్‌ఫారాలు, ఫుట్ ఓవర్‌బ్రిడ్జిలు, పార్శిల్ ప్రాంతాలు, ఇతర కీలక ప్రదేశాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లో నిలిపి ఉంచిన రైళ్లలోనూ సోదాలు నిర్వహించారు.
అయితే భద్రతా బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహించినప్పటికీ ఎలాంటి పేలుడు పదార్థాలు, అనుమానాస్పద వస్తువులు లేదా వ్యక్తులు కనిపించకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. బెదిరింపు కాల్ రావడంతో స్టేషన్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
ముంబైలో అత్యంత రద్దీగా ఉండే రైల్వే టెర్మినల్స్‌లో CSMT ఒకటి. ప్రతిరోజూ వేలాది మంది సబర్బన్, దూరప్రాంత ప్రయాణికులు ఈ స్టేషన్ ద్వారా రాకపోకలు సాగిస్తుంటారు. బాంబు బెదిరింపు కాల్‌ను అధికారులు తీవ్రంగా పరిగణించి తనిఖీలు చేపట్టారు.
