థియేటర్లలో సందడి చేసిన సినిమాలు ఇప్పుడు ఓటీటీలోనూ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, నటుడు తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ తెలుగు మూవీ ‘క్రేజీ కళ్యాణం’ (Crazy Kalyanam) డిజిటల్ ఎంట్రీకి రెడీ అయింది. ఇప్పటికే ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పై ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఆహా గుడ్‌న్యూస్ చెప్పింది. మరి ఈ సినిమా ఎప్పుడు స్ట్రీమింగ్ కానుంది? కథేంటి? బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితాన్ని అందుకుంది? ఇప్పుడు చూద్దాం.
నవంబర్ 20 నుంచి ఆహాలో స్ట్రీమింగ్..
‘క్రేజీ కళ్యాణం’ డిజిటల్ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా సొంతం చేసుకుంది. నవంబర్ 20, 2026 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. తెలుగు ప్రేక్షకులతో పాటు తమిళ ఆడియన్స్ కూడా ఈ సినిమాను చూసే అవకాశం ఉంది. రెండు భాషల్లోనూ ఒకేసారి అందుబాటులోకి రానుంది.
‘క్రేజీ కళ్యాణం’ కథేంటి?
మెదక్ జిల్లాకు చెందిన పర్వతాలు (నరేశ్) ఆత్మాభిమానానికి ప్రాధాన్యమిచ్చే మధ్యతరగతి తండ్రి. పెద్ద కూతురిని తాగుబోతైన బాలరాజు (తరుణ్ భాస్కర్)కిచ్చి పెళ్లి చేసి సమాజంలో పరువు పోగొట్టుకుంటాడు. దీంతో చిన్న కూతురు కీర్తి (అనుపమ పరమేశ్వరన్)కి మంచి సంబంధం చేసి పోయిన పరువు నిలబెట్టుకోవాలనుకుంటాడు. కానీ, స్వతంత్ర భావాలున్న కీర్తి కాలేజీ మేట్ ఉదయ్ (అఖిల్ రాజ్)ని ప్రేమిస్తుంది. తన పెళ్లి ముందుగా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకుంటుంది. అయితే తండ్రి పట్టుబట్టి అమెరికా సంబంధం ఫిక్స్ చేయగా.. కీర్తి తన తండ్రి ఆశలను నెరవేర్చిందా? లేదా ప్రేమను గెలుచుకుందా? అన్నదే అసలు కథ.
ఎలా ఉందంటే?
ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి పెళ్లిళ్ల కోసం లక్షలు ఖర్చు పెట్టే బదులు.. అందులో పదో వంతు చదువుకు వెచ్చిస్తే వారి జీవితాలు మారిపోతాయనే చక్కటి సందేశాన్ని దర్శకుడు ఈ సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. ఫస్టాఫ్‌లో తరుణ్ భాస్కర్ తాగుబోతు వేషాలు, నరేశ్‌తో ఆయన చేసే కామెడీ సన్నివేశాలు థియేటర్లలో నవ్వులు పూయిస్తాయి. అయితే కీర్తి - ఉదయ్ ల లవ్‌ట్రాక్ మాత్రం పూర్తిగా రొటీన్‌గా సాగి కాస్త బోర్ కొట్టిస్తుంది. ఇక సెకండాఫ్‌లో ఎమోషన్స్ డోస్ పెరిగింది. క్లైమాక్స్ కాస్త సాగదీసినట్లు అనిపించినా, తండ్రీకూతుళ్ల మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు ఆలోచింపజేస్తాయి.
బాక్సాఫీస్ వద్ద ఎలా రాణించింది?
అక్టోబర్ 16న విడుదలైన ‘క్రేజీ కళ్యాణం’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ట్రేడ్ అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.1.64 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు టాక్ . థియేటర్లలో మిశ్రమ స్పందన అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
