- చట్ట సవరణలకు కేరళ హైకోర్టు కీలక సూచన
- డ్రంక్ అండ్ డ్రైవ్ ఘటనలపై తీవ్ర ఆందోళన
కొచ్చి: నేటితరంలో పిల్లల పరిణతిని దృష్టిలో ఉంచుకుని, జువైనల్ చట్టంలోని వయోపరిమితిని 18 ఏండ్ల నుంచి 16 ఏండ్లకు తగ్గించేలా చట్టసవరణ చేయాల్సిన టైమొచ్చిందని కేరళ హైకోర్టు అభిప్రాయపడింది. తాగుడుకు అలవాటు పడి యువత చేస్తున్న తప్పులు, రోడ్డు ప్రమాదాల పట్ల ఆందోళన వ్యక్తంచేస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. నెదుంబస్సేరిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన పిటిషన్‌ను విచారిస్తున్న సందర్భంగా జస్టిస్ ఎ.బద్రుద్దీన్.. ఈ మధ్యకాలంలో పెరుగుతున్న ఇలాంటి ఘటనలపై సమగ్ర విచారణ అవసరమని పేర్కొన్నారు.
కొల్లాంకు చెందిన వినోద్ విక్రమ్ దాఖలు చేసిన ఈ పిటిషన్లో.. 23 ఏండ్లలోపు వారికి మద్యం విక్రయించడం, అందించడంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటీవల నెదుంబస్సేరిలో 18 ఏండ్ల యువకుడు మద్యం మత్తులో తన మినీ కూపర్ కారుతో స్కూటర్‌ను ఢీకొట్టడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికి కారణమైన నిందితుడికి బార్లలో మద్యం అందించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో కోర్టు తన మధ్యంతర ఉత్తర్వుల్లో స్పందిస్తూ ‘16 ఏండ్లు నిండేసరికి నేటి పిల్లలు తగినంత పరిణతిని ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుత ధోరణులను గమనించినట్లయితే, చట్టంలో పేర్కొన్న బాల నేరస్తుల వయోపరిమితిని 16 ఏండ్లకు తగ్గించేలా చట్టసభలు తగిన సవరణలను పరిశీలించాల్సిన సమయం వచ్చింది’ అని పేర్కొంది.
