- 18 నుంచి 59 ఏళ్ల కుటుంబ పెద్దకు రక్షణ.. నవం
- ‘ప్రగతి పథం.. సకల జనహితం’ పేరుతో పథకానికి19న శ్రీకారం
- ఎవరికి బీమా, ఎవరెవరి పేర్లు నామినీగా పెట్టాలో ఫ్యామిలీ ఆధారంగా నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి ఆర్థిక రక్షణ, సామాజిక భరోసా కల్పించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం’ నమోదు, నామినేషన్ ఫారం వివరాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ పథకం కింద 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్సు గల కుటుంబంలోని పెద్ద సభ్యుడిని బీమాకు అర్హుడిగా నమోదు చేస్తారు.
బీమా చేసిన వ్యక్తి మరణించిన సందర్భంలో బాధిత కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా ప్రయోజనాన్ని ప్రభుత్వం నేరుగా అందించనుంది. ‘ప్రగతి పథం.. సకల జనహితం.. మన ప్రజా ప్రభుత్వం’ అనే నినాదంతో ఈ నెల 19న సిద్దిపేటలో పథకాన్ని ప్రారంభించనుంది. ఈ పథకం ఫారంలో దరఖాస్తు సంఖ్యతో పాటు లబ్ధిదారుల పూర్తి వివరాలను పారదర్శకంగా నమోదు చేసేలా కాలమ్స్ ఏర్పాటు చేశారు. కుటుంబ పెద్దతో పాటు కుటుంబ సభ్యుల వివరాలు, నామినీ ఎంపిక ప్రక్రియను సులభతరం చేస్తూ ఈ ఫారాన్ని డిజైన్ చేశారు.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల వారీగా వివరాలు
దరఖాస్తు ఫారం మొదటి భాగంలో ‘ప్రదేశ వివరాలు’ కింద లబ్ధిదారుల నివాస ప్రాంత సమాచారాన్ని కోడ్లతో సహా తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది. ఇందులో జిల్లా, శాసనసభ నియోజకవర్గం పేరుతో పాటు వాటికి సంబంధించిన ప్రత్యేక కోడ్లను పొందుపరచాలి. నివాస ప్రాంతాన్ని గ్రామీణ, పట్టణ విభాగాలుగా విభజించగా, గ్రామీణ ప్రాంతాల వారు మండలం, రెవెన్యూ గ్రామం, గ్రామ పంచాయతీ, వార్డు కోడ్లతో పాటు వీధి పేరు, ఇంటి నంబరు రాయాల్సి ఉంటుంది. పట్టణ ప్రాంతాల లబ్ధిదారులు మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, జోన్, సర్కిల్, వార్డు కోడ్లు, వీధి పేరు, ఇంటి నంబరు వివరాలను స్పష్టంగా నింపాలి. వీటితో పాటు లబ్ధిదారుడికి ఆహార భద్రతా కార్డు (రేషన్ కార్డు) నంబరు కలిగి ఉంటే దానిని నమోదు చేయడంతో పాటు కులం, మతం వివరాలను నిర్ణీత కోడ్ల రూపంలో తెలియజేయాల్సి ఉంటుంది.
ఆధార్‌తో సులభంగా బీమా నమోదు
ఫారం రెండో విభాగంలో ‘బీమా దారుడి వివరాలు’ ‘ఇతర కుటుంబ సభ్యుల వివరాలు’ నమోదు చేసేందుకు ప్రత్యేక పట్టికలను ఇచ్చారు. బీమా దారుడి విభాగంలో కుటుంబ పెద్ద పేరు, తండ్రి లేదా భర్త పేరు, లింగం, ఆధార్ కార్డు ప్రకారం పుట్టిన తేదీ, ఆధార్ నంబరు (తప్పనిసరి) మొబైల్ నంబరు వివరాలను రాయాలి. ఆ తర్వాత కుటుంబంలోని మిగిలిన సభ్యుల వివరాల కోసం ఐదు వరుసలతో కూడిన పట్టికను కేటాయించగా, అందులో కుటుంబ సభ్యుల పేర్లు, తండ్రి/భర్త పేరు, లింగం, ఆధార్ ప్రకారం పుట్టిన తేదీ, బీమా దారుడితో ఉన్న సంబంధం వారి ఆధార్ నంబర్లను తప్పనిసరిగా నమోదు చేయాలి. తద్వారా ఒకే ఫారంలో కుటుంబం మొత్తానికి సంబంధించిన సమగ్ర డేటాను ప్రభుత్వం వద్ద భద్రపరిచే వెసులుబాటు కలుగుతుంది.
నామినీగా మైనర్ ఉన్నా ప్రత్యేక వెసులుబాటు
దరఖాస్తు చివరి భాగంలో నామినీ వివరాలు, ధ్రువీకరణ ప్రక్రియను అత్యంత స్పష్టంగా పొందుపరిచారు. కుటుంబ సభ్యుల్లో ఎవరిని నామినీగా నియమిస్తున్నారో వారి పేరుతో పాటు బీమా క్లెయిమ్‌లో వారికి దక్కాల్సిన శాతాన్ని స్పష్టంగా పేర్కొనాలి. ఒకవేళ నామినీగా నియమించిన వ్యక్తి మైనర్ అయితే, వారికి సంరక్షకుడిగా ఉండే అపాయింటీ పేరు, నామినీతో ఉన్న సంబంధం, అపాయింటీ ఆధార్ నంబరు అపాయింటీ సంతకాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. ఫారంలో స్టార్ (*) గుర్తు ఉన్న వివరాలు తప్పనిసరి అని, డబుల్ స్టార్ ఉన్న చోట సూచనల జాబితా ప్రకారం కోడ్లను నమోదు చేయాలని స్పష్టం చేశారు. చివరగా దరఖాస్తును పరిశీలించే ఇన్చార్జి అధికారి పేరు, సంతకం, మొబైల్ నంబరుతో పాటు బీమా దారుడి పేరు సంతకం తీసుకున్న తర్వాత నమోదు ప్రక్రియ పూర్తవుతుంది. ఆ తర్వాత వాటిని ఆన్లైన్చేయనున్నారు.
