Teja Sajja-Mourya engagement: ఘనంగా హీరో తేజ సజ్జా నిశ్చితార్థం... కాబోయే భార్య మౌర్య బ్యాక్‌గ్రౌండ్ ఇదే!

Teja Sajja-Mourya engagement: ఘనంగా హీరో తేజ సజ్జా నిశ్చితార్థం...  కాబోయే భార్య మౌర్య బ్యాక్‌గ్రౌండ్ ఇదే!

టాలీవుడ్ వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో తేజ సజ్జా జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై చెబుతూ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారు. తేజ సజ్జా, మౌర్యల నిశ్చితార్థ వేడుక హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ తాజ్ కృష్ణా హోటల్‌లో సోమవారం (నవంబర్ 16) అత్యంత వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలో కాబోయే వధూవరులు ఉంగరాలు మార్చుకున్నారు. ప్రస్తుతం ఈ ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయనతో పాటు మాస్ మహారాజా రవితేజ, నేచురల్ స్టార్ నాని, రానా దగ్గుబాటి, అడివి శేష్, సుధీర్ బాబు, అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, ప్రశాంత్ వర్మ, అనిల్ రావిపూడి తదితరులు హాజరై జంటను ఆశీర్వదించారు. రాజకీయ ప్రముఖుల్లో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మంత్రి సీతక్క, మాజీ మంత్రి హరీశ్ రావు తదితరులు  హాజరై శుభాకాంక్షలు తెలిపారు.. ఇంతమంది ప్రముఖులు ఒకే వేడుకలో కనిపించడంతో కార్యక్రమం తారాతోరణంగా మారింది.

►ALSO READ | Teja Sajja Engagement: తేజ సజ్జా నిశ్చితార్థ వేడుకకు హాజరైన తెలంగాణ గవర్నర్..

అయితే అసలు ఇంతకీ తేజ సజ్జా మనసు గెలుచుకున్న మౌర్య ఎవరు? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఆమెకు సినీ పరిశ్రమతో ఎలాంటి సంబంధం లేదు. హైదరాబాద్‌కు చెందిన కుటుంబ నేపథ్యం ఉన్నప్పటికీ అమెరికాలో పెరిగారు.. ఆమె తండ్రి టెక్నాలజీ రంగంలో వ్యాపారాలు నిర్వహిస్తుండగా, మౌర్య కూడా కుటుంబ వ్యాపార వ్యవహారాల్లో భాగస్వామిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదొక పూర్తిస్థాయి పెద్దలు కుదిర్చిన వివాహం. లైమ్‌లైట్‌కు దూరంగా పెరిగిన మౌర్యకు సినిమా ప్రపంచంతో పెద్దగా పరిచయం లేకపోవడమే తనకు బాగా నచ్చిందని తేజ ఇటీవలే మనసులో మాట బయటపెట్టారు.

ఇక ఈ జంట వివాహం వచ్చే నెల (డిసెంబర్) రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో గ్రాండ్ డెస్టినేషన్ వెడ్డింగ్‌గా జరగనుంది. అనంతరం టాలీవుడ్ ప్రముఖులు, స్నేహితుల కోసం హైదరాబాద్‌లో భారీ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం 'జాంబీ రెడ్డి 2', 'మిరాయ్' సీక్వెల్ పనులతో ఫుల్ బిజీగా ఉన్న తేజ సజ్జా, త్వరలోనే కొత్త జీవితంలోకి అడుగుపెడుతుండటంతో సోషల్ మీడియా వేదికగా అభిమానులు శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు.