ముంబై: బాలీవుడ్ సీనియర్ యాక్టర్ అమితాబ్ బచ్చన్‌కు ప్రాణహాని బెదిరింపులు ఆగడం లేదు. ఇటీవల లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ అమితాబ్ బచ్చన్‌ను చంపేస్తామని హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగానే, అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్‌లకు తాజాగా మరోసారి ప్రాణహాని బెదిరింపులు వచ్చాయి. అమితాబ్, అభిషేక్ బచ్చన్లను కాల్చి చంపేస్తానని సోషల్ మీడియా వేదికగా గ్యాంగ్‌స్టర్ గోల్డీ ధిల్లాన్ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఢిల్లీ పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసిన వికాస్ ఠాకూర్, దీపక్ సింగ్ తన అనుచరులేనని పేర్కొన్న ధిల్లాన్.. వారి అరెస్టుల వల్ల తమ దాడి ప్రణాళికకు ఎలాంటి నష్టం కలగదని పేర్కొన్నాడు.
తమ గ్యాంగ్‌కు చెందిన దాదాపు 200 మంది అనుచరులు ప్రస్తుతం ముంబైలోనే సిద్ధంగా ఉన్నారని హెచ్చరించాడు. ఎన్ని బుల్లెట్ ప్రూఫ్ క్యాబిన్లు ఏర్పాటు చేసుకున్నా.. బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్లు ధరించిన.. పోలీసులు ఎంత భద్రత కల్పించినా అమితాబ్, అభిషేక్ బచ్చన్లను కాల్చి చంపుతామని వార్నింగ్ ఇచ్చాడు. 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లకు బాధ్యులు, సిక్కు సమాజానికి వ్యతిరేకంగా మాట్లాడే వారిని ఎప్పటికీ వదిలిపెట్టబోమని స్పష్టం చేశాడు. వరుస బెదిరింపుల నేపథ్యంలో ముంబై పోలీసులు అమితాబ్ నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధం ఉన్న వికాస్ ఠాకూర్, దీపక్ సింగ్ అనే ఇద్దరు అనుమానిత షూటర్లను 2026, నవంబర్ 15న ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. 1984 సిక్కు అల్లర్ల సమయంలో అమితాబ్ చేసినట్లు ఆరోపిస్తున్న వ్యాఖ్యలపై ప్రతీకారంగా ఆయన ఇంటిపై కాల్పులు జరిపేందుకు వీరు కుట్ర పన్నినట్లు విచారణలో పోలీసులు గుర్తించారు.
అమితాబ్‌పై ఆరోపణలు ఏంటంటే..?
అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ హత్యకు ప్రతీకారంగా 1984లో దేశవ్యాప్తంగా సిక్కు వ్యతిరేక అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. దేశ రాజధాని ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో సిక్కులను ఊచకోత కోశారు. గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన అమితాబ్ బచ్చన్ ఇందిరా హత్య సమయంలో రక్తానికి రక్తంతోనే బదులు తీర్చుకుంటామంటూ సిక్కు వ్యతిరేక అల్లర్లను సమర్థించారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.
ALSO READ : భర్తకు దూరంగా రమ్యకృష్ణన్..
అయితే, తనపై వచ్చిన ఈ ఆరోపణలను అమితాబ్ బచ్చన్ మొదటి నుంచీ తీవ్రంగా ఖండిస్తున్నారు. తాను అలాంటి వ్యాఖ్యలు చేయలేదని బిగ్ బీ పలుమార్లు వివరణ ఇచ్చారు. ఇందిరా గాంధీ మరణం తనకు తల్లిని కోల్పోయినంత బాధను కలిగించిందని, ఆ సమయంలో తాను దుఃఖంలో ఉన్నానే తప్ప ఏ వర్గానికి వ్యతిరేకంగానూ రెచ్చగొట్టే నినాదాలు చేయలేదని స్పష్టం చేశారు. తాను పూర్తిగా నిర్దోషినని పేర్కొన్నారు.
