3 నెలల్లో క్రెడిట్ కార్డుల ద్వారా రూ.200 కోట్లు సంపాదించాలి: టార్గెట్ ఫిక్స్ చేసుకున్న పంజాబ్ నేషనల్ బ్యాంక్

3 నెలల్లో క్రెడిట్ కార్డుల ద్వారా రూ.200 కోట్లు సంపాదించాలి: టార్గెట్ ఫిక్స్ చేసుకున్న పంజాబ్ నేషనల్ బ్యాంక్

ప్రభుత్వ యాజమాన్యంలో నడుస్తున్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన క్రెడిట్ కార్డ్, క్యాష్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ విభాగాల నుంచి వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ప్రతి 3 నెలలకు రూ.200 కోట్ల లాభం సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంటే క్రెడిట్ కార్డుల నుంచి ఏ రేంజ్‌లో ఆదాయం రాబట్టాలనే ఈ నిర్ణయంతో స్పష్టం అయ్యింది. ఈ విషయాన్ని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎండీ అండ్ సీఈఓ అశోక్ చంద్ర స్వయంగా వెల్లడించారు.

ఫీ-బేస్డ్ ఆదాయాన్ని పెంచుకోవడానికి బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్, సప్లై చెయిన్ మేనేజ్‌మెంట్, క్యాష్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్.. ఈ మూడు విభాగాలకు విడివిడిగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు నిర్మించిందని, ప్రతి విభాగానికి జనరల్ మేనేజర్ స్థాయి అధికారిని బాధ్యుడిగా నియమించిందని అశోక్ చంద్ర వెల్లడించారు. ట్రెజరీ ఆదాయం, లోన్ రికవరీల్లో సవాళ్లు ఉండవచ్చని అంచనా వేసిన నేపథ్యంలో నాన్-ఇంటరెస్ట్ ఆదాయాన్ని బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు. 

క్రెడిట్ కార్డ్స్ బేస్ రెట్టింపు..
2008లో మొదలైన PNB క్రెడిట్ కార్డ్ బిజినెస్‌లో మార్చి 2025 నాటికి 6లక్షల కార్డులకు పైగా ఉండేవని, డిజిటల్ ప్లాట్‌ఫామ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత 9 నెలల్లోనే మరో 5 లక్షల కార్డులు పెరిగినట్లు అశోక్ చంద్ర తెలిపారు. మొత్తం కార్డ్ యూజర్ల బేస్ ఇప్పుడు 11 లక్షలకు చేరిందని చెప్పారు. బ్యాంక్ తన ప్రీమియమ్ PNB మెటల్ క్రెడిట్ కార్డ్ Luxuraను కూడా లాంచ్ చేసింది. ఇప్పటివరకు 27వేల 140 మంది కస్టమర్లు ఈ కార్డ్‌కు అప్లై చేసుకున్నారు.

మార్చి 2027 నాటికి మొత్తం క్రెడిట్ కార్డ్ బేస్‌ను 13 లక్షలకు పైగా తీసుకెళ్లాలని.. కనీసం 30వేల ప్రీమియమ్ కార్డ్ హోల్డర్లు ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ విభాగం ప్రతి త్రైమాసికంలో రూ.200 కోట్ల లాభం ఇవ్వాలని బ్యాంక్ టార్గెట్ పెట్టుకుంది. 

సప్లై చెయిన్ ఫైనాన్స్..
డీలర్, వెండర్ ఫైనాన్సింగ్ కోసం బ్యాంక్ ఎండ్-టు-ఎండ్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ నిర్మించిందని చంద్ర చెప్పారు. ఈ విభాగం మొదలైన 9 నెలల్లోనే సుమారు రూ.7వేల 800 కోట్ల శాంక్షన్లు నమోదయ్యాయని, అవుట్‌స్టాండింగ్ పోర్ట్‌ఫోలియో రూ.5వేల 200 కోట్లకు చేరిందని చెప్పారు. 

క్యాష్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్..
క్యాష్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ విభాగం ఇప్పటికే ప్రతి క్వార్టర్లో రూ.130-140 కోట్ల లాభం అందిస్తోందని, వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలోనే రూ.200 కోట్ల లక్ష్యాన్ని అందుకుంటుందని బ్యాంక్ అంచనా వేస్తోంది.