ఉత్తరప్రదేశ్ రాష్ట్రం.. కాన్పూర్ సిటీ. అక్కడ 77 ఏళ్ల వ్యక్తి ఉన్నాడు.. అతన్ని శాఖాహారి బాబా.. అంటే తన 77 ఏళ్ల జీవిత కాలంలో ఎప్పుడూ మాంసాహారం తినలేదు అని గొప్పగా చెప్పేవాడు.. ఎంతలా అంటే శాఖాహారం తినటం వల్లే ఇంత ఆరోగ్యంగా ఉన్నాను అంటూ.. అందరూ ఇన్నాళ్లు నమ్ముతూ వచ్చారు.. అందరూ అతన్ని శాఖాహారి బాబా అంటూ ముద్దుగా పిలిచేవారు.. చెట్టున ఉన్న పండు రాలితే కింద పడినట్లు.. ఇప్పుడు ఖర్మ అనుకోండి.. పాపం అనుకోండి.. పండింది.. బండారం బయటపడింది. దొంగతనంగా తింటున్న చేపకు ఉన్న ముల్లు గొంతులో ఇరుక్కుని.. శాఖాహారి బాబా ఇప్పుడు మాంసాహారి బాబా అయ్యాడు.. సోషల్ మీడియాలో ఆసక్తికరంగా చర్చించుకుంటున్న ఈ కథనం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన గంగా బక్ష్ అనే 77 ఏళ్ల వృద్ధుడికి ఇంట్లో పక్కా శాకాహారి అనే పేరుంది. అయితే ఆయనకు చేపలు తినడం కూడా ఇష్టమే. ఇంట్లో వాళ్లకు తెలియకుండా అప్పుడప్పుడు చేపలు తినేవాడు. కానీ ఓ రోజు చేప తింటుండగా అందులోని ముల్లు గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో ఆయన తీవ్ర అసౌకర్యానికి గురయ్యాడు. గొంతు వాచిపోవడంతో పాటు నీళ్లు తాగడానికి కూడా ఇబ్బంది పడాల్సి వచ్చింది. పరిస్థితి గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లారు.
చేపలు తింటావా అని అడిగితే..
ఆసుపత్రిలో గంగా బక్ష్‌ను పరీక్షించిన డాక్టర్లకు ఆయన గొంతులో ఏదో గట్టిది ఇరుక్కున్నట్లు అనుమానం వచ్చింది. గొంతులో వాపు, మింగడంలో ఇబ్బందిని గమనించిన డాక్టర్లు అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో డాక్టర్ ఆయనను కొన్ని ప్రశ్నలు అడిగారు. చేపలు తింటారా ? ఏదైనా చిన్న వస్తువు గొంతులో ఇరుక్కుందా ? అని ఆరా తీశారు. అయితే గంగా బక్ష్ మాత్రం తాను పక్కా శాకాహారినని, చేపలు తినే అలవాటే లేదని చెప్పాడు. దీంతో వైద్యులు మరింత జాగ్రత్తగా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు.
►ALSO READ | ప్రతీకారం తీర్చుకున్న భారత సైన్యం.. CRPF క్యాంపుపై దాడికి పాల్పడ్డ ఇద్దరు ఉగ్రవాదులు హతం
ఎండోస్కోపీ చేయడంతో బయటపడిన నిజం
మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సూచనల మేరకు వైద్యుల బృందాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం ఎండోస్కోపీ ద్వారా గొంతులో ఇరుక్కున్న దాని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. తీరా బయటకు తీసి చూసేసరికి అది చేప ముల్లుగా తేలింది. దీంతో వైద్యులకు అసలు విషయం అర్థమైంది. ఇంట్లో తాను శాకాహారినని చెప్పుకునే గంగా బక్ష్.. బయట మాత్రం చేపలు తింటున్నాడన్న విషయం బయటపడిపోయింది. మరోసారి వైద్యులు ప్రశ్నించడంతో ఇక దాచడం సాధ్యం కాక నిజం ఒప్పుకున్నాడు. తాను రహస్యంగా చేపలు తింటున్నానని అంగీకరించాడు. ఇలా ఒక్క చేప ముల్లు ఆయన ఇన్నాళ్లుగా దాచిన రహస్యాన్ని బయటపెట్టింది.
'దొంగతనం చేస్తూ దొరికిపోయా'..
గొంతులో ఇరుక్కున్న ముల్లును తొలగించిన తర్వాత గంగా బక్ష్ ఆరోగ్యం మెరుగుపడింది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే సమయంలో ఆయన ముఖంలో ఆందోళన కంటే నవ్వే ఎక్కువగా కనిపించింది. తన రహస్యం బయటపడటంపై వైద్యుల దగ్గర సరదాగా స్పందించాడు. 'దొంగతనం చేస్తూ పట్టుబడిన దొంగకు ఇలాగే జరుగుతుంది' అన్నట్లుగా నవ్వుతూ అన్నారు. అంతేకాదు.. ఆయనతో పాటు ఆసుపత్రికి వచ్చిన మనవరాలు కూడా తాతయ్య మాటలకు నవ్వుకుంది.
పాన్ షాప్ నడుపుతున్న తాతయ్యకు ఇలా ఎందుకైంది?
గంగా బక్ష్ కాన్పూర్‌లోని బారా ప్రాంతంలో నివసిస్తున్నాడు. అక్కడే ఓ పాన్ షాప్ నడుపుతున్నాడు. మసాలాలు తినే అలవాటు కూడా ఉండటంతో మొదట వైద్యులు గొంతులో వాపుకు వేరే కారణం ఉండొచ్చని భావించారు. కానీ పరీక్షల్లో చేప ముల్లు ఉన్నట్లు గుర్తించారు. సకాలంలో వైద్యం అందడంతో గొంతులో ఇరుక్కున్న ముల్లును తొలగించారు. ప్రస్తుతం గంగా బక్ష్ క్షేమంగా ఉన్నరు.
మొత్తానికి ఇంట్లో శాకాహారినని చెప్పుకుంటూ బయట చేపలు తిన్న ఈ తాతయ్యకు చివరకు ఓ చిన్న చేప ముల్లు పెద్ద చిక్కే తెచ్చిపెట్టింది. ఇన్నాళ్లూ ఎవరికీ తెలియని రహస్యం ఒక్కసారిగా బయటపడటంతో ఈ ఘటన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
