నల్లగొండ పట్టణం ఎర్రజెండాల రెపరెపలతో ఎరుపెక్కింది. పట్టణంలోని ఎన్జీ కాలేజీ గ్రౌండ్లో నిర్వహించిన అఖిల భారత కిసాన్ సభ (AIKS) భారీ బహిరంగ సభకు వివిధ జిల్లాలు, రాష్ట్రాల నుంచి రైతు సంఘం నేతలు, సీపీఎం కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సభా ప్రాంగణం జనసందోహంతో కిక్కిరిసింది. ఎటుచూసినా ఎర్రజెండాలు కనిపించడంతో ఎన్జీ కాలేజీ గ్రౌండ్ ఎర్రవర్ణాన్ని సంతరించుకుంది.
ఆలిండియా కిసాన్ సభ(AIKS) 36జాతీయ మహాసభలు (ఆదివారం, నవంబర్ 15) నల్లగొండలో ప్రారంభమయ్యాయి. ఈ మహాసభల్లో భాగంగా తొలిరోజు పట్టణంలోని ఎన్జీ కాలేజీలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో వివిధ రాష్ట్రాలకు చెందిన జాతీయ స్థాయి రైతు సంఘాల నాయకులు, రైతులు, సీపీఎం పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. త్రిపుర శాసనసభ ప్రతిపక్ష నేత, సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యుడు జితేంద్ర చౌదరి, సీపీఐ(ఎం) జాతీయ నాయకురాలు, మాజీ రాజ్యసభ సభ్యురాలు బృందా కారత్, AIKS జాతీయ అధ్యక్షుడు అశోక్ ధావలే, జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ విజూ కృష్ణన్, పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే, సీపీఐ(ఎం) సీనియర్ నేత జూలకంటి రంగారెడ్డి సభకు స్వాగత కమిటీ అధ్యక్షుడిగా జరిగిన ఈ సభకు పలు రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల నాయకులు, మాజీ శాసన సభ్యులు నంద్యాల నర్సింహారెడ్డి, స్థానిక సీపీఐ(ఎం) నేతలు సభలో పాల్గొన్నారు.
ALSO READ : ఇందిరమ్మ రాజ్యం.. మహిళలకు ప్రాధాన్యం
భారీగా తరలివచ్చే కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు విస్తృత ఏర్పాట్లు చేశారు. తాగునీటి సౌకర్యంతో పాటు భారీ లైటింగ్, విశాలమైన వేదిక, ఇతర మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణమంతా ఎర్రజెండాలు, బ్యానర్లతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జాతీయ స్థాయి నాయకుల రాకతో నల్లగొండలో రాజకీయ సందడి నెలకొంది.
