కరువుపైనా బీఆర్ఎస్ రాజకీయాలు..జనవరి 31 నాటికి ‘జాన్‌‌‌‌పహాడ్‌‌‌‌’ నుంచి నీళ్లివ్వాల్సిందే : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

కరువుపైనా బీఆర్ఎస్ రాజకీయాలు..జనవరి 31 నాటికి ‘జాన్‌‌‌‌పహాడ్‌‌‌‌’ నుంచి నీళ్లివ్వాల్సిందే :  మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్/పాలకవీడు/ కోదాడ, వెలుగు : రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులను కూడా బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ వాటాగా రావాల్సిన కృష్ణా, గోదావరి నదీ జలాలను ఏపీకి మళ్లిస్తున్నారంటూ పచ్చి అబద్ధాలతో విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బుధవారం సూర్యాపేట జిల్లా పాలకవీడు, కోదాడ మండలాల్లో వివిధ అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టు పనులను ఆయన పరిశీలించారు. ఎల్‌‌‌‌నినో ప్రభావంతో నీటి ఎద్దడి తలెత్తే ముప్పు పొంచి ఉన్న వేళ రైతులకు కొండంత అండగా నిలవాల్సింది పోయి, వారి కష్టాల నుంచే రాజకీయ లబ్ధి పొందాలని బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ చూడటం సిగ్గుచేటని మండిపడ్డారు. 2023 డిసెంబరు 7న ప్రజా ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే పదేళ్ల బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పాలన కంటే రికార్డు స్థాయిలో కృష్ణా, గోదావరి జలాలను తెలంగాణ అవసరాల కోసం సమర్థంగా వినియోగించుకున్నామని స్పష్టం చేశారు.   

10 వేల ఎకరాలకు నీరందాలి

పులిచింతల జలాశయం తీర ప్రాంత రైతాంగం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న జాన్‌‌‌‌పహాడ్‌‌‌‌ ఎత్తిపోతల పథకాన్ని జనవరి నెలాఖరు నాటికి పూర్తి చేసి తీరుతామని మంత్రి ఉత్తమ్​ తెలిపారు. సవరించిన ఆయకట్టు పరిధిలోని 10 వేల ఎకరాలకూ జనవరి 31 నాటికి కృష్ణా జలాలు పారాల్సిందేనని అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ‘‘ఈ ప్రాజెక్టు పనులను నేనే స్వయంగా పలుమార్లు పరిశీలించా. ప్రతిసారీ గడువు పొడిగిస్తూ పోతున్నారు. ఇకపై అలాంటి నిర్లక్ష్యాన్ని ఏమాత్రం సహించేది లేదు. జనవరి నెలాఖరు నాటికి మొత్తం 10 వేల ఎకరాల ఆయకట్టుకూ నీరు చేరాల్సిందే. గడువు దాటితే కాంట్రాక్టర్లు, అధికారులపై కఠిన చర్యలు ఉంటాయి’’ అని హెచ్చరించారు. 

ఈ పథకం ద్వారా జాన్‌‌‌‌పహాడ్‌‌‌‌, మునిమోపుల, తుమ్మల సహా 6 ప్రధాన చెరువులను నింపుతామని వివరించారు. అనంతరం కోదాడ మండలం రెడ్లకుంట వద్ద పాలేరు వాగుపై రూ.47.64 కోట్లతో నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకం పనులను మంత్రి పరిశీలించారు. కోదాడ పట్టణంలో రూ.5 కోట్లతో నిర్మిస్తున్న నీటిపారుదల శాఖ భవనం, రూ.8 కోట్లతో చేపడుతున్న ఆర్‌‌‌‌అండ్‌‌‌‌బీ శాఖ భవనం, షాదీఖానా నిర్మాణ పనులను పరిశీలించారు. చిలుకూరు గుట్టల్లో 22 ఎకరాల విస్తీర్ణంలో రూ.200 కోట్లతో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల పనులను పరిశీలించారు. కోదాడలో రూ.50 కోట్లతో నిర్మిస్తున్న నవోదయ పాఠశాల భవన నిర్మాణాన్ని కూడా త్వరగా పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమాల్లో నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్‌‌‌‌రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే ఎన్.పద్మావతిరెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ కే.నరసింహ తదితరులు పాల్గొన్నారు.