యాదగిరిగుట్టలో తొలిసారి కోటి పుష్పార్చన! నవంబర్ 19, 20 తేదీల్లో వైభవంగా నిర్వహణ

యాదగిరిగుట్టలో తొలిసారి కోటి పుష్పార్చన!  నవంబర్ 19, 20 తేదీల్లో వైభవంగా నిర్వహణ

 లోక కల్యాణార్థం మహా క్రతువు : ఆలయ ఈవో భవానీ శంకర్
హైదరాబాద్, వెలుగు: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో అపూర్వ ఆధ్యాత్మిక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఆలయ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా స్వామివారికి అత్యంత వైభవంగా కోటి పుష్పార్చన మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ నెల 19, 20 తేదీల్లో రెండు రోజులపాటు ఈ విశేష క్రతువు జరగనుందని ఆలయ కార్యనిర్వహణాధికారి భవానీ శంకర్ తెలిపారు. 

లోక శాంతి, రాష్ట్ర సుభిక్షత, భక్తుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఈ మహోత్సవాన్ని  నిర్వహిస్తున్నట్టు చెప్పారు. వేద పండితులు, రుత్వికుల మంత్రోచ్ఛారణల నడుమ వివిధ రకాల సుగంధ పుష్పాలు, పవిత్ర తులసీదళాలతో లక్ష్మీనరసింహుడికి అర్చన జరగనుంది. యాదాద్రి క్షేత్రంలో ఇంతటి భారీ ఎత్తున పుష్పార్చన నిర్వహించడం ఇదే ప్రథమం కావడంతో భక్తుల్లో విశేష ఆసక్తి నెలకొంది. 

కాగా,  ఈ విశేష క్రతువు కోసం ఆలయ యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా సేకరించిన రకరకాల పుష్పాలను సమకూర్చుతున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శన ఏర్పాట్లు, ప్రసాద వితరణపై అధికారులు దృష్టి సారించారు. ఈ మహత్తర పూజా కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఈవో పిలుపునిచ్చారు.