యూపీలో 181 సీట్లకు కాంగ్రెస్ గురి.. అఖిలేష్ యాదవ్‌కు జాబితా అందజేత

యూపీలో 181 సీట్లకు కాంగ్రెస్ గురి.. అఖిలేష్ యాదవ్‌కు జాబితా అందజేత

లక్నో: 2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఇండియా కూటమి మధ్య సీట్ షేరింగ్‎పై చర్చలు ఊపందుకున్నాయి. యూపీలోని మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకు గాను పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ 181 సీట్లు కోరింది. ఈ మేరకు 181 అసెంబ్లీ నియోజకవర్గాల జాబితాను అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీకి కాంగ్రెస్ సమర్పించింది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, తదితర సీనియర్ నేతలు చర్చించి ఈ జాబితాను ఫైనల్ చేశారు. 

కాంగ్రెస్ కోరిన 181 అసెంబ్లీ స్థానాల్లో 135 జనరల్, 45 ఎస్సీ రిజర్వ్‌డ్, ఒక ఎస్టీ రిజర్వ్‌డ్ స్థానాలు ఉన్నాయి. ఈ జాబితాలో రాయ్‌బరేలీ, ఆమేథీ, బాగ్‌పత్, లోని, బులంద్‌షహర్, మధుర, ఆగ్రా రూరల్, ఫతేపూర్ సిక్రీ, పిలిభిత్, షాజహాన్‌పూర్, షాహాబాద్, కాన్పూర్ కంటోన్మెంట్ వంటి కీలక అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. 

సీట్ల పంపకాలపై చర్చలు కొలిక్కి రానప్పటికీ బీజేపీని ఓడించేందుకు ఇండియా కూటమి ఐక్యంగా పోటీ చేస్తోందని కాంగ్రెస్, ఎస్పీ పార్టీలు స్పష్టం చేశాయి. కాంగ్రెస్‌తో తమ సంబంధాలు చాలా బాగున్నాయని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు. యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ 181 సీట్లు కోరిందని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ సమర్పించిన జాబితాపై ఇరు పార్టీల కమిటీలు విస్తృతంగా చర్చించి గెలుపు అవకాశాల ఆధారంగా తుది సీట్ల ఒప్పందాన్ని ఖరారు చేయనున్నట్లు తెలిపారు. ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంటుందో ఆ పార్టీకే సీటు దక్కుతుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

యూపీలో 2027లో అసెంబ్లీ ఎన్నికలు

2027 ఫిబ్రవరి – మార్చిలో ఉత్తరప్రదేశ్‎లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. యూపీ అసెంబ్లీలో మొత్తం 403 స్థానాలు ఉండగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 202 స్థానాల మెజారిటీ అవసరం. 2022లో జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 255 స్థానాలు గెలిచి వరుసగా రెండోసారి అధికారం చేపట్టింది. సమాజ్‌వాదీ పార్టీ (SP) 111 స్థానాల్లో విజయం సాధించి ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. 

►ALSO READ | బిల్కిస్ బానో కేసులో బిగ్ ట్విస్ట్.. 17 ఏళ్లుగా జైల్లో ఉన్న ఇద్దరు దోషులకు సుప్రీంకోర్టు బెయిల్!

ఈసారి గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించాలని బీజేపీ వ్యుహాలు సిద్ధం చేస్తోంది. ఎలాగైనా బీజేపీని అడ్డుకోవాలని మిత్రపక్షాలు కాంగ్రెస్, ఎస్పీ గట్టి పట్టుదలతో ఉన్నాయి. 2029లో దేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో 2027లో జరిగే యూపీ ఎన్నికలకు ప్రాధాన్యం సంతరించుకుంది.