Dulquer Vs Mammootty: ఒకేరోజు తండ్రి కొడుకుల బాక్సాఫీస్ వార్

Dulquer Vs Mammootty: ఒకేరోజు తండ్రి కొడుకుల బాక్సాఫీస్ వార్

Dulquer Salmaan Vs Mammootty: సినీ ప్రపంచంలో తండ్రీకొడుకులు ఒకే రంగంలో రాణించడం అరుదేమీ కాదు. కానీ ఇద్దరూ నటించిన సినిమాలు ఒకే రోజున థియేటర్లలోకి వచ్చి బాక్సాఫీస్ దగ్గర ఆసక్తిని రేకెత్తించడం మాత్రం ప్రత్యేకమే. ఇప్పుడు మలయాళ చిత్ర పరిశ్రమలో అలాంటి ఆసక్తికరమైన సందర్భం రాబోతోంది. మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటించిన ‘ఓం’ (O.M – Operation Mole), ఆయన తనయుడు దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ‘ఆకాశంలో ఒక తార’ (AOT) నవంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. దీంతో తెలుగు, తమిళ, మలయాళ సినీ వర్గాల్లో ఈ తండ్రీకొడుకుల సినిమాల పోటీపై ఆసక్తి నెలకొంది. మరి తండ్రి అనుభవం పైచేయి సాధిస్తుందా? కొడుకు క్రేజ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందా? అన్నది ఆసక్తిగా మారింది..

ఆకాశంలో ఒక తార Vs ఓం

నవంబర్ 20న విడుదలకు సిద్ధమవుతున్న ఈ రెండు చిత్రాలు కథ, నేపథ్యం, జానర్ పరంగా పూర్తిగా భిన్నమైనవి. ఒకవైపు ప్రేక్షకుల హృదయాలను తాకే భావోద్వేగాలతో కూడిన ఇన్‌స్పిరేషనల్ డ్రామాగా ‘ఆకాశంలో ఒక తార’వస్తుంటే.. మరోవైపు యాక్షన్, క్రైమ్, థ్రిల్లింగ్ అంశాలతో కూడిన కథగా ‘ఓం’ సిద్ధమవుతోంది. రెండు సినిమాల టీజర్లు, పాటలు, ట్రైలర్‌తో ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.

తండ్రి స్టార్‌డమ్ Vs కొడుకు క్రేజ్!

బాక్సాఫీస్ బరిలో తండ్రి మమ్ముట్టి అనుభవం ఒకవైపు.. కొడుకు దుల్కర్ సల్మాన్ క్రేజ్ మరోవైపు! ‘ఓం’ సినిమాకు ధనుష్ స్టార్‌డమ్, సాయిపల్లవి, శ్రీలీల క్రేజ్ అదనపు బలంగా నిలుస్తుండగా.. ‘ఆకాశంలో ఒక తార’కు దుల్కర్ తెలుగు మార్కెట్, పవన్ సాధినేని టేకింగ్, జి.వి. ప్రకాష్ మ్యూజిక్ ప్లస్ పాయింట్స్‌గా మారనున్నాయి. ముఖ్యంగా తెలుగులో స్ట్రెయిట్ మూవీ కావడం దుల్కర్‌కు కలిసొచ్చే అంశం. మరి ఈ బాక్సాఫీస్ క్లాష్‌లో తండ్రి పైచేయి సాధిస్తారా? కొడుకు సత్తా చాటుతాడా? అన్నది ఇంట్రెస్టింగ్..

దుల్కర్‌కు తెలుగులో మరో క్రేజీ మూవీ!

‘మహానటి’, ‘సీతారామం’, ‘లక్కీ భాస్కర్’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన దుల్కర్ సల్మాన్.. ఇప్పుడు ‘ఆకాశంలో ఒక తార’ తో మరోసారి అలరించేందుకు సిద్ధమయ్యారు. పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సాత్విక వీరవల్లి హీరోయిన్‌గా నటిస్తుండగా, శ్రుతి హాసన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఓ యువతి కలలు, ఆశయాలకు అండగా నిలిచే భర్తగా దుల్కర్ కనిపించనున్నారు. కేవలం ప్రేమకథగానే కాకుండా, ఎమోషన్స్, ఇన్‌స్పిరేషన్ కలగలిసిన కథగా ఈ సినిమా ఉండబోతోంది. జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన ‘చిట్టి చిట్టి చీమ’, ‘రాధే రాధే’  పాటలు ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేశాయి. ముఖ్యంగా దుల్కర్ లుక్, మ్యూజిక్ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. మొత్తానికి ఈ సినిమాతో దుల్కర్ మరో తెలుగు హిట్‌ను తన ఖాతాలో వేసుకుంటారా అన్న ఆసక్తి నెలకొంది!

AOT స్టోరీ బ్యాక్‌డ్రాప్‌:

చిన్నప్పటి నుంచే చదువులో చురుగ్గా ఉండే ఓ అమ్మాయి.. ఆకాశమే హద్దుగా ఎదగాలని, ఏకంగా వ్యోమగామి కావాలని కలలు కంటుంది. కానీ ఆమె చుట్టూ ఉన్న సమాజం మాత్రం ఆ కలలకు కళ్లెం వేయాలని చూస్తుంది. ఆడపిల్ల అంటే వంటింటికే పరిమితం కావాలి. ఇంటి పనులే బాధ్యతలు అన్న పాతకాలపు ఆలోచనలు ఆమెను అడుగడుగునా అడ్డుకుంటాయి. కనీసం ఊరి సరిహద్దులు దాటి వెళ్లేందుకు కూడా ప్రోత్సాహం లేని పరిస్థితులు ఎదురవుతాయి. అయినా ఆమె ఆత్మవిశ్వాసం మాత్రం చెక్కుచెదరదు. ఏదో ఒక రోజు తన లక్ష్యాన్ని చేరుకుంటాననే నమ్మకంతో ముందుకు సాగుతుంది. అటువంటి ప్రతికూల పరిస్థితుల్లో ఆమెను అణచివేయాలని చూసే సమాజానికి వ్యతిరేకంగా, ఆమె కలను తన కలగా మార్చుకుని భుజస్కందాలై నిలిచే భర్త పాత్రలో దుల్కర్ సల్మాన్ అదరగొట్టారు. భార్య లక్ష్య సాధన కోసం భర్త పడే తపన, అందించే అండదండలు ట్రైలర్ ను అత్యంత భావోద్వేగంగా, మోటివేషనల్‌గా మలిచాయి. దుల్కర్, సాత్విక జోడీ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా ఫ్రెష్‌గా ఉంది.

మమ్ముట్టి, ధనుష్ కాంబినేషన్‌లో ‘ఓం’..

మరోవైపు మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, తమిళ స్టార్ ధనుష్ కలిసి నటిస్తున్న ‘ఓం – ఆపరేషన్ మోల్’పై భారీ అంచనాలు ఉన్నాయి. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ధనుష్ అండర్‌కవర్ పోలీస్‌గా కనిపించనుండగా, సాయిపల్లవి పోలీస్ అధికారిణిగా నటిస్తున్నారు. మమ్ముట్టి బర్మా కార్తికేయన్ అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. శ్రీలీల ధనుష్ భార్యగా నటిస్తున్నారు. ముఖ్యంగా ధనుష్, మమ్ముట్టి కాంబినేషన్ సన్నివేశాలు హైలైట్‌గా నిలవనున్నాయి. ‘అమరన్'తో ఆకట్టుకున్న రాజ్‌కుమార్ పెరియసామి ఈసారి ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి. సాయి అభ్యంకర్ సంగీతం, యానిక్ బెన్, కేచా ఖంఫక్ఫీ రూపొందించిన యాక్షన్ సన్నివేశాలు సినిమాకు అదనపు ఆకర్షణగా నిలవనున్నాయి.

కథ విషయానికి వస్తే:

తమిళనాడు–ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. అంతర్జాతీయ స్మగ్లింగ్ నెట్‌వర్క్ అధినేత బర్మా కార్తికేయన్‌గా మమ్ముట్టి కనిపిస్తుండగా.. అండర్‌కవర్ పోలీస్‌గా ధనుష్ ఆ ముఠాలోకి ప్రవేశిస్తారు. ఐపీఎస్ అధికారి నిత్యారెడ్డిగా సాయిపల్లవి ఈ ఆపరేషన్‌కు నాయకత్వం వహిస్తారు. మాఫియాను అంతం చేసేందుకు చేపట్టే 'ఆపరేషన్ మోల్' చుట్టూ కథలో ఉత్కంఠ నెలకొంటుంది. ధనుష్, మమ్ముట్టి మధ్య సాగే పోరు సినిమాకు ప్రధాన ఆకర్షణ కానుండగా.. ధనుష్ భార్య రోజాగా శ్రీలీల, పవర్‌ఫుల్ పోలీస్ అధికారిణిగా సాయిపల్లవి తమ పాత్రలతో కథలో కీలకంగా నిలవనున్నారు.

బాక్సాఫీస్ వద్ద ఎవరిది పైచేయి?

ఒకవైపు ఎమోషన్స్, లవ్, ఇన్‌స్పిరేషనల్ స్టోరీతో 'ఆకాశంలో ఒక తార'.. మరోవైపు యాక్షన్, క్రైమ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో 'ఓం'. రెండు సినిమాల ట్రైలర్లు, పాటలు ఇప్పటికే అంచనాలను పెంచేశాయి. అయితే బాక్సాఫీస్ దగ్గర ఎవరు పైచేయి సాధిస్తారనేది ఓపెనింగ్స్, మౌత్ టాక్‌పై ఆధారపడి ఉంటుంది. మరి నవంబర్ 20న తండ్రి మమ్ముట్టి స్టార్‌డమ్ గెలుస్తుందా? కొడుకు దుల్కర్ క్రేజ్ సత్తా చాటుతుందా? లేక ధనుష్ తన యాక్షన్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తారా? చూడాలి!