మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యారు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న ఈ హీరో.. ఈ సారి ఎమోషనల్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. లేటెస్ట్ గా ఆయన నటించిన చిత్రం 'ఆకాశంలో ఒక తార' నవంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో చిత్రం బృందం ట్రైలర్ రిలీజ్ చేసింది.
ఇప్పటికే విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్‌తో ఈ సినిమా కథపై ఓ స్పష్టత వచ్చినప్పటికీ.. లేటెస్ట్ గా వచ్చిన ట్రైలర్ కథలోని ఎమోషన్స్‌ను మరింత బలంగా ఆవిష్కరించింది. ఓ మారుమూల గ్రామానికి చెందిన కల్పన (సాత్విక వీరవల్లి)కు వ్యోమగామి కావాలనే పెద్ద కల ఉంటుంది. ఆకాశాన్ని అందుకోవాలని ఆశపడే ఓ సాధారణ పల్లెటూరి అమ్మాయి ప్రయాణం ఎలాంటి మలుపులు తిరిగింది? ఆమె కలను నిజం చేయడానికి కృష్ణ (దుల్కర్ సల్మాన్) ఎలా అండగా నిలిచాడు? ఎదురైన అడ్డంకులను అధిగమించి ఆమె లక్ష్యాన్ని చేరుకునేందుకు ఎలా సహకరించాడు? అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశంగా కనిపిస్తోంది.
ముఖ్యంగా ఈ ట్రైలర్‌లోని భావోద్వేగ సన్నివేశాలు, హృదయాన్ని తాకే సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. జీవీ ప్రకాష్ కుమార్ అందించిన నేపథ్య సంగీతం సన్నివేశాలకు మరింత బలాన్ని చేకూర్చింది. దుల్కర్ సల్మాన్ తన సహజమైన నటనతో మరోసారి మెప్పించేలా కనిపిస్తుండగా.. సాత్విక వీరవల్లి కూడా తన పాత్రలో ఒదిగిపోయింది. నిర్మాణ విలువలు, విజువల్స్ కూడా సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి.
ఈ చిత్రంలో శ్రుతి హాసన్, మురళీ శర్మ, రుహానీ శర్మ కీలక పాత్రల్లో నటించారు. పవన్ సాధినేని దర్శకత్వం వహించగా.. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా, వైజయంతీ మూవీస్ సంయుక్తంగా నిర్మాణంలో భాగమయ్యాయి. ప్రస్తుతం రిలీజ్ చేసిన ఈ ట్రైలర్ సినీ ప్రియుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది. మరి వెండితెరపై ఈ ఎమోషనల్ జర్నీ ప్రేక్షకులను ఏ మేరకు కట్టిపడేస్తుందో నవంబంర్ 20న తెలియనుంది.
