ఎవరైనా చనిపోతే వారి వారి సంప్రదాయం ప్రకారం 10 రోజుల తర్వాత పెద్ద ఖర్మ, దినం రోజు ఏర్పాటు చేయటం ఆనవాయితీ. 80 ఏళ్ల ఓ వ్యక్తి మాత్రం.. తాను బతికి ఉండగానే 13వ రోజు పెద్ద ఖర్మ, దినం కార్యక్రమాలను వేడుకగా నిర్వహించాడు. వెయ్యి మందికి భోజనాలు పెట్టాడు.. తాను చనిపోయిన తర్వాత ఎలా అయితే ఆ కార్యక్రమం ఉండాలి అనుకున్నాడో.. బతికి ఉండగానే అలాగే నిర్వహించాడు. ఊరంతా పిలిచి భోజనాలు.. ఆ తర్వాత తన వారసత్వాన్ని తన మునిమనవడికి అందరి సమక్షంలో అప్పగించాడు.. ఈ వేడుకకు ఏకంగా ఆ రాష్ట్ర మంత్రి హాజరుకావటం మరింత చర్చనీయాంశం అయ్యింది. బతికి ఉండగానే దినం కార్యక్రమం ఏంటీ.. దీని వెనక కారణాలు ఏంటీ.. ఎవరీ ఆ మనిషి అనేది వివరంగా తెలుసుకుందామా....
ఉత్తరప్రదేశ్‌లోని బాఘ్‌పత్ జిల్లాలో ఈ ఆసక్తికర ఘటన జరిగింది. జోహ్రీ గ్రామానికి చెందిన చౌదరి బల్జోర్ సింగ్ (80) ఆదివారం తన ఇంట్లోనే ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. సాధారణంగా పెద్దకర్మ అంటే మరణించిన వ్యక్తి జ్ఞాపకార్థం నిర్వహించే కార్యక్రమం. కానీ బల్జోర్ సింగ్ మాత్రం తాను బతికి ఉండగానే ఈ వేడుక జరుపుకున్నారు.
తన మరణం తర్వాత కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమం కోసం ఇబ్బందులు పడటం, ఏర్పాట్ల విషయంలో ఎవరైనా విమర్శలు చేయడం తనకు ఇష్టం లేదని ఆయన తెలిపారు. అందుకే అన్ని ఏర్పాట్లను తానే దగ్గరుండి చూసుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'నా పెద్దకర్మ కార్యక్రమానికి సంబంధించిన పనులు నేనే స్వయంగా చేసుకుంటున్నాను' అని... తాను బతికుండగానే అందరినీ ఒకచోట చేర్చి, వారితో కలిసి భోజనం చేయాలన్నది తన కోరికగా చెప్పారు.
900 మందికి ఘనంగా విందు.. గ్రామమంతా సందడే
బల్జోర్ సింగ్ నిర్వహించిన ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు, చౌదరి సామాజిక వర్గానికి చెందిన వారు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మొత్తం సుమారు 900 మంది ఈ వేడుకలో పాల్గొన్నారు. ఆదివారం ఉదయం నుంచే ఆయన ఇంటి దగ్గర సందడి మొదలైంది. ఇంటి ఆవరణలో పెద్ద పెద్ద వంట సామన్లు ఏర్పాటు చేసి, వంటవాళ్లతో ప్రత్యేకంగా భోజనాలు సిద్ధం చేయించారు. అతిథుల కోసం పూరీలు, రైతా, రెండు రకాల కూరగాయల కూరలు, లడ్డూలతో పాటు పలు సంప్రదాయ వంటకాలు వడ్డించారు.
ఉదయం హోమంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత సంప్రదాయ పద్ధతిలో పగడీ వేడుక నిర్వహించారు. మధ్యాహ్నం అందరికీ సామూహిక విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ మంత్రి కేపీ మాలిక్ కూడా హాజరయ్యారు. దీంతో ఈ వింతైన వేడుక చుట్టుపక్కల గ్రామాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.
మనవడికి తలపాగా.. కుటుంబ బాధ్యతలు అప్పగింత!
ఈ వేడుకలో అందరి దృష్టిని ఆకర్షించిన మరో ముఖ్యమైన ఘట్టం పగడీ కార్యక్రమం. ఉత్తర భారతదేశంలోని కొన్ని సామాజిక సంప్రదాయాల్లో కుటుంబ పెద్ద మరణించిన తర్వాత, కుటుంబ బాధ్యతలు చేపట్టే వ్యక్తికి తలపాగా కట్టడం లేదా అందించడం ఆనవాయితీగా ఉంటుంది. అయితే బల్జోర్ సింగ్ మాత్రం ఈ కార్యక్రమాన్ని కూడా తన సమక్షంలోనే నిర్వహించాలని అనుకున్నారు. తన మనవడు ముకుల్‌కు స్వయంగా తలపాగాను అందించి, కుటుంబ బాధ్యతలను తర్వాతి తరానికి అప్పగించారు.
ముకుల్ వయసు ప్రస్తుతం సుమారు 10 సంవత్సరాలు. తన మనవడి చేతికి కుటుంబ బాధ్యతలను ప్రతీకాత్మకంగా అందించడం ద్వారా భవిష్యత్తులో కుటుంబాన్ని ముందుకు నడిపించే బాధ్యత అతడిదేనని ఈ వేడుక ద్వారా తెలియజేశారు.
కుటుంబం కోసం ముందే అన్ని ఏర్పాట్లు!
బల్జోర్ సింగ్‌కు ముగ్గురు కుమార్తెలు, ఒక మనవడు ఉన్నారు. ఆయన కుటుంబంలో కుమార్తె పింకీ, అల్లుడు సుఖ్‌పాల్, ముగ్గురు మనవరాళ్లు, మనవడు ముకుల్ ఉన్నారు. తనకు వ్యవసాయ భూమి ఉన్నట్లు కూడా ఆయన వెల్లడించారు. తన తర్వాత కుటుంబ సభ్యులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదని, తాను చేయాల్సిన కార్యక్రమాలను తన జీవితకాలంలోనే పూర్తి చేసుకోవాలని ఆయన భావించినట్లు తెలిపారు.
చనిపోయాక కంటే.. బతికుండగానే అందరితో కలిసి ఉండాలనే కోరిక!
సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఆయన జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటారు. కానీ బల్జోర్ సింగ్ మాత్రం తనకు ఇష్టమైన వారందరినీ తాను బతికి ఉన్నప్పుడే ఒకచోట చూడాలనుకున్నారు. వారిని స్వయంగా పలకరించి, వారితో కలిసి భోజనం చేయాలనుకున్నారు. తన మరణం తర్వాత కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేయడం కంటే, తానే అన్నీ చూసుకుని తన కోరికను నెరవేర్చుకోవాలని భావించారు. అందుకే సంప్రదాయానికి భిన్నంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
మొత్తానికి, చనిపోయిన తర్వాత జరగాల్సిన కార్యక్రమాన్ని బతికుండగానే నిర్వహించుకున్న బల్జోర్ సింగ్ నిర్ణయం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ముఖ్యంగా తన మనవడికి తలపాగాను అందించి కుటుంబ బాధ్యతలను అప్పగించిన తీరు ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
