అది ఆవు దూడ అనుకున్నారా.. సింహాన్ని బైకులపై తరిమిన వీడియో వైరల్!

అది ఆవు దూడ అనుకున్నారా.. సింహాన్ని బైకులపై తరిమిన వీడియో వైరల్!

సింహం ఒక్క గర్జనకే అడవి అల్లకల్లోలం అవుతుంది. దాని దరిదాపులోకి పోవడానికి కూడా భయపడతారు. అలాంటిది బైకులపై తరిమిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేదో గేదెనో, ఆవు దూడనో తరిమినట్లుగా బైకులపై తరిమిన వ్యక్తుల ధైర్యానికి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ఈ వీడియో వైరల్ అవ్వటంతో సింహాన్ని తరిమిన అటవీ అధికారులను ఉద్యోగాల నుంచి తొలగించారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.  

గుజరాత్‌లోని అంబర్డీ సఫారీ పార్క్‌లో అవుట్‌సోర్స్ సిబ్బంది మోటార్‌సైకిల్‌పై సింహాన్ని తరిమిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సింహాన్ని ఎలాంటి భయం లేకుండా తరిమితే.. అది దాడి చేస్తే ఏంటి పరిస్థితి అంటూ సోషల్ మీడియాలో రియాక్షన్స్ వచ్చాయి. ఫారెస్ట్ అధికారుల ధైర్యాన్ని మెచ్చుకుంటూ షేర్ చేస్తునన్నారు.  

అయితే ఈ ఘటనను అటవీశాఖ సీరియస్ గా తీసుకుంది. విచారణ తర్వాత ముగ్గురు ఔట్ సోర్సింగ్ సిబ్బందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై  ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్  జైపాల్ సింగ్ పీటీఐకి వివరణ ఇచ్చారు. సాయంత్రం సమయంలో సింహాలను క్రాల్ అనే ఆవరణలోకి పంపడం ప్రతిరోజూ జరిగేదే. సాధారణంగా ఇందుకు జీప్ వాడతారు. కానీ కొంతమంది సిబ్బంది మోటార్‌సైకిళ్లు ఉపయోగించారు. ఘటనపై నోటీసు జారీ చేసి విచారణ చేపట్టాం అని ఆయన చెప్పారు.

ఈ వీడియో దీపావళి సీజన్‌లో రికార్డయినట్లు ఇన్‌చార్జ్ అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ మితేశ్ వణియా తెలిపారు. అయితే జంతువుకు ఎలాంటి హాని చేయాలని అనుకోలేదని ఆయన స్పష్టం చేశారు.

 300 హెక్టార్లకు పైగా విస్తరించిన ఈ సఫారీ పార్క్‌లో రోజూ సాయంత్రం 5 గంటలకు సింహాలకు 100x100 మీటర్ల కంచె ఆవరణలో ఉంచి ఆహారం పెడతారు.  దీన్ని క్రాల్ అంటారు.  వీడియోలో కనిపించే అధికారులు క్రాల్ దిశలో రాకుండా తప్పిపోయిన ఒక సింహాన్ని తిరిగి అక్కడికి నడిపిస్తున్నారు. జంతువుకు హాని చేయాలనే ఉద్దేశం ఏమాత్రం లేదు అని అధికారులు తెలిపారు. 

పర్యాటక సీజన్‌లో అంబర్డీ సఫారీ పార్క్‌కు భారీగా సందర్శకులు వచ్చారని, సిబ్బంది నిరంతరాయంగా 12 గంటలు విధులు నిర్వహించారని   తెలిపారు. అమ్రేలీ జిల్లాలో ఉన్న ఈ సఫారీ పార్క్ ఆసియాటిక్ సింహాలకు ఆవాసంగా ఉంది. జంతువులను నిర్ణీత సమయానికి క్రాల్‌లోకి నడిపించడం ప్రతిరోజూ చేసే దినచర్య అని అధికారులు వివరించారు.