దీపావళి తర్వాత పెరిగిన మొబైల్ ధరలు: భారీగా రేట్లు పెంచిన శాంసంగ్, షావోమి

దీపావళి తర్వాత పెరిగిన మొబైల్ ధరలు: భారీగా రేట్లు పెంచిన శాంసంగ్, షావోమి

స్మార్ట్‌ఫోన్ ప్రియులకు, ముఖ్యంగా బడ్జెట్.. మిడ్-రేంజ్ ఫోన్ కొనాలనుకునే వారికి గట్టి షాక్ తగిలింది. దీపావళి సీజన్ ముగియగానే మొబైల్ తయారీ సంస్థలు శాంసంగ్, షావోమి తమ ఫోన్ల ధరలను భారీగా పెంచేశాయి. ఈ రెండు కంపెనీలు కలిసి దాదాపు 41 స్మార్ట్‌ఫోన్ వేరియంట్ల ధరలను 19 శాతం వరకు పెంచాయి. నవంబర్ 16 నుంచి ఈ కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి.

పెరుగుతున్న మెమరీ, విడిభాగాల తయారీ ఖర్చులే మెుబైల్ రేట్ల పెంపునకు ప్రధాన కారణమని తెలుస్తోంది. శాంసంగ్ గెలాక్సీ A, F సిరీస్‌లకు చెందిన 22 వేరియంట్లు, షావోమి రెడ్‌మి పోర్ట్‌ఫోలియో నుంచి 19 వేరియంట్ల ధరలు మోడల్, స్టోరేజ్ ఆధారంగా రూ.వెయ్యి నుంచి రూ.4వేల వరకు పెరిగాయి. ఒప్పో, వివో, రియల్‌మీ వంటి ఇతర కంపెనీలు కూడా త్వరలోనే ఇదే బాట పట్టే అవకాశం ఉందని మార్కెట్ నిపుణుల అంచనా.

శాంసంగ్ విషయానికొస్తే.. గెలాక్సీ A07 5G ధర రూ.2వేలు పెరగడంతో దీని 4GB+128GB మోడల్ ధర రూ. 20వేల 999 నుంచి రూ. 22వేల 999కి చేరింది. అలాగే F17 5G, A17 5G ధరలు కూడా రూ. 2వేలు చొప్పున పెరిగాయి. కొన్ని A57 వేరియంట్లపై రూ. 4వేలు వరకు భారం పడింది. దీంతో రూ. 20వేలు లోపు దొరికే శాంసంగ్ 5G ఫోన్ల ఆప్షన్లు మార్కెట్లో చాలావరకు తగ్గిపోయాయి. మరోవైపు షావోమి తన రెడ్‌మి A7 ప్రో 5G (4GB+128GB)పై అత్యధికంగా 18.75 శాతం (రూ. 3వేలు) ధర పెంచడంతో దీని ధర రూ.15వేల 999 నుంచి రూ. 18వేల 999కి చేరింది. రెడ్‌మి నోట్ 17 సిరీస్ మోడళ్ల ధరలు కూడా రూ.3వేల నుంచి రూ.4వేల వరకు పెరిగాయి. అయితే పాత స్టాక్ ఉన్నంత వరకు పాత ధరలకే ఫోన్లు లభించే అవకాశం ఉందని రిటైలర్లు చెబుతున్నారు.

ఈ ధరల పెంపు ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇటీవల ముగిసిన దీపావళి పండుగ సీజన్‌లో ఆశించిన స్థాయిలో సేల్స్ జరగలేదు. కస్టమర్లు ఎక్కువగా రాకపోవడంతో అమ్మకాలు 18-20 శాతం వరకు తగ్గాయని రిటైలర్లు తెలిపారు. ఈ సమయంలో ధరలు పెరగడం వల్ల ప్రజలు కొత్త ఫోన్ల కొనుగోలుకు బదులుగా సెకండ్ హ్యాండ్ లేదా రెఫర్బిష్డ్ ఫోన్ల వైపు మొగ్గు చూపుతున్నారు.