కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. ముఖ్యంగా శైవఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు సమర్పిస్తున్నారు. 2026 నవంబర్ 16 ఉదయం నుంచే వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు శివనామ స్మరణతో మార్మోగాయి. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించి, కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు.
కీసరగుట్టలో భక్తుల సందడి:
మెడ్చల్ జిల్లాలోని కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి ఆలయానికి ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లో తాగునీటి వసతి కల్పించారు. ఆలయ తటాకం వెంకటేష్ శర్మ, ఈవో సుధాకర్ రెడ్డి ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
వేములవాడ రాజన్న ఆలయంలో ఆధ్యాత్మిక శోభ:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. ఆలయ ఆవరణలో కార్తీక దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఉదయం నుంచే క్యూలైన్ ద్వారా దర్శనానికి బారులు తీరారు. స్వామివారికి ఇష్టమైన కోడె మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానికి నాలుగు గంటల సమయం పట్టింది. ఆలయ ఈవో రమాదేవి ఆధ్వర్యంలో ఏర్పాట్లపై పర్యవేక్షణ కొనసాగింది.
వరంగల్ వేయి స్తాంభాల గుడిలో ప్రత్యేక పూజలు:
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని శైవ క్షేత్రాల్లోనూ కార్తీక మాస శోభ కనిపించింది. వేయి స్తంభాల గుడి, సిద్దేశ్వరాలయం, ఐనవోలు మల్లికార్జున స్వామి గుడి, ములుగు జిల్లా రామప్ప, పాలకుర్తి శ్రీ సోమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఉదయం నుంచే భక్తులు తరలివచ్చారు. రుద్రేశ్వరుడికి సామూహిక రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల కోసం ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
చెరువుగట్టు ఆలయం:
నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెరువుగట్టు దేవస్థానంలో కార్తీక కోటి సోమవారం సందర్భంగా భక్తుల రద్దీ నమోదైంది. కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. వ్రత మండపం, దర్శన క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు.
చెన్నూరులో ఆలయాలు కలకల:
మంచిర్యాల జిల్లా చెన్నూరులోని ప్రసిద్ధ శ్రీ అంబా అగస్తేశ్వర స్వామి ఆలయానికి కూడా భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ‘ఓం నమః శివాయ’ పంచాక్షరీ మంత్రంతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక క్యూలైన్లు, ఇతర ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ తెలిపింది.
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని శివాలయంలో ఉదయం 5 గంటల నుంచే భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివలింగానికి జలాభిషేకం చేసి, బిల్వపత్రాలు సమర్పిస్తూ దీపారాధన చేశారు.
కార్తీక మాసంలో వచ్చే కోటి సోమవారం అత్యంత పవిత్రమని, ఈ రోజున శివుడికి అభిషేకాలు, పూజలు, దీపారాధనలు చేయడం వల్ల కోటి రెట్ల పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ‘ఓం నమః శివాయ’ మంత్ర జపంతో పరమశివుడిని ఆరాధించడం వల్ల పాపవిముక్తి, మానసిక ప్రశాంతత, అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం.
