- కీలకంగా మహిళా కోట, డీలిమిటేషన్ బిల్లు.. ఎస్ఐఆర్పై ప్రతిపక్షాల ఫోకస్
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ మొదటి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశాలకు సంబంధించి అధికారిక తేదీలు త్వరలోనే వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారబోయే కీలక అంశాలపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రాబోయే 2029 సాధారణ ఎన్నికల నాటికి పార్లమెంట్, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేయాలని భావిస్తోంది.
దీనిలో భాగంగా, లోక్సభ స్థానాల సంఖ్యను ప్రస్తుతమున్న 543 నుంచి గరిష్టంగా 850కి పెంచేలా రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 1971 జనాభా లెక్కల ఆధారంగా రాష్ట్రాల మధ్య ప్రాతినిధ్య సమతుల్యత దెబ్బతినకుండా, అన్ని రాష్ట్రాల్లోనూ లోక్సభ సీట్లను దాదాపు 50% మేర పెంచే ప్రతిపాదనలపై చర్చిస్తున్నారు. దీనివల్ల ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాల నుంచి వ్యక్తమయ్యే ఆందోళనలను తగ్గించవచ్చని భావిస్తున్నారు.
మూడింట రెండొంతుల మెజారిటీ
ఈ రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందాలంటే లోక్సభలో మూడింట రెండు వంతుల మెజారిటీ అంటే కనీసం 361 ఓట్లు అత్యవసరం. ప్రస్తుతం లోక్సభలో అధికార ఎన్డీయే కూటమికి సుమారు 320 మంది సభ్యుల బలం మాత్రమే ఉంది. ఈ బిల్లు సులభంగా నెగ్గడానికి విపక్షాల మద్దతు లేదా సభలో వారి గైర్హాజరు వంటి అంశాలు అత్యంత కీలకం కానున్నాయి. ఎస్ఐఆర్ అంశంపై పార్లమెంట్లో అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదాలు, ఘర్షణలు తలెత్తే అవకాశం ఉంది. వర్షాకాల సమావేశాలు ముగిసినప్పటికీ, వాటిని అధికారికంగా ముగింపు చేయకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
