పుణె: మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని ఎన్సీపీ(ఎస్పీ) ఎమ్మెల్యే రోహిత్ పవార్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరారు. అదేవిధంగా పుణె రింగ్ రోడ్డుకు ఆయన పేరు పెట్టాలన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం కేంద్ర హోం మంత్రి అమిత్షా ఆదివారం పుణె చేరుకున్నారు. సోమవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో అజిత్ పవార్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
ఈ నేపథ్యంలో రోహిత్ పవార్ ఎక్స్ వేదికగా స్పందించారు. దివంగత నేత విగ్రహ ఏర్పాటుకు మద్దతు తెలిపిన జిల్లా పరిషత్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన.. అజిత్ పవార్ మద్దతుతో రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి పదవులు అనుభవిస్తున్న నేతలు పుణె రింగ్ రోడ్డుకు ఆయన పేరు పెట్టాలని ఎందుకు డిమాండ్ చేయడం లేదని ప్రశ్నించారు. మహారాష్ట్ర అభివృద్ధికి ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివని, దశాబ్దానికి పైగా ఆయన పుణె జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా పనిచేశారని గుర్తు చేశారు.
