ఒంటరి మహిళలకు ట్రావెల్ తోడు.. ప్రపంచాన్ని చుట్టేస్తున్న హైదరాబాద్ లేడీస్ క్లబ్

ఒంటరి మహిళలకు ట్రావెల్ తోడు.. ప్రపంచాన్ని చుట్టేస్తున్న హైదరాబాద్ లేడీస్ క్లబ్
  • మహిళల కోసం 
  • హైదరాబాద్ లేడీస్ ట్రావెల్ క్లబ్
  • 250కి పైగా టూర్లు.. 25 వేల మంది సభ్యులు
  • కశ్మీర్ నుంచి బాలి దాకా యాత్రలు

ఒంటరిగా కొత్త ప్రదేశాలు చూడాలని, ప్రకృతి అందాలను ఆస్వాదించాలని, కొత్త సంస్కృతులు తెలుసుకోవాలని చాలామంది మహిళలకు ఉంటుంది. కానీ భద్రత ఎలా, తోడు ఎవరు, ఏర్పాట్లు ఎట్లా అనే సందేహాలు వాళ్లను వెనక్కి లాగుతుంటాయి. అలాంటి మహిళలను ఓ గ్రూపుగా చేసి కొత్త పర్యాటక ప్రపంచాన్ని పరిచయం చేస్తోంది ‘హైదరాబాద్ లేడీస్ ట్రావెల్ క్లబ్’.  ప్రయాణం అంటే ఒక చోటు నుంచి మరో చోటుకు వెళ్లడమే కాదు; కొత్త అనుభవాలు, కొత్త స్నేహాలు, జీవితాంతం గుర్తుండే జ్ఞాపకాలు అంటున్నారు దీని వ్యవస్థాపకురాలు మీనూ సోలంకి.

 

క్లబ్ లక్ష్యమిదే..

ట్రావెల్, హాస్పిటాలిటీ రంగంలో 15 ఏండ్లకు పైగా అనుభవం ఉన్న హైదరాబాద్‌‌‌‌కు చెందిన మీనూ సోలంకి, దేశవిదేశాల్లో తిరిగిన అనుభవంతో ఈ క్లబ్ ప్రారంభించారు. ఒంటరి మహిళలు కూడా నిర్భయంగా పర్యాటక ప్రాంతాలు చూడాలనేదే తన లక్ష్యమని, మహిళల కోసం దేశంలోనే ఇది మొదటి ప్రత్యేక ట్రావెల్ క్లబ్ అని ఆమె చెబుతున్నారు. ఇప్పటివరకు 250కి పైగా మహిళా టూర్లు నిర్వహించామని, 25 వేల మందికి పైగా క్రియాశీల సభ్యులు ఉన్నారని తెలిపారు. బడ్జెట్‌‌‌‌లోనే టూర్లు ప్లాన్ చేస్తున్నామని చెప్పారు.

కశ్మీర్ టు బాలి 

ప్రకృతి అందాలు, చారిత్రక కట్టడాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు, సాహస యాత్రలు.. అన్ని రకాల టూర్లు క్లబ్ నిర్వహిస్తోంది. కశ్మీర్, లేహ్–లడఖ్, స్పితి వ్యాలీ, సిమ్లా–మనాలి, కేరళ, గోవా, ఈశాన్య రాష్ట్రాలు, అండమాన్ వంటి దేశీయ టూర్లతో పాటు కేదార్‌‌‌‌నాథ్, బద్రీనాథ్, చార్‌‌‌‌ధామ్, కాశీ, అయోధ్య, పూరి, ద్వారకా వంటి ఆధ్యాత్మిక యాత్రలు, నేపాల్, భూటాన్, థాయ్‌‌‌‌లాండ్, దుబాయ్, వియత్నాం, బాలి వంటి విదేశీ యాత్రలు కూడా నిర్వహిస్తోంది. తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలకూ ప్రత్యేక టూర్లు ఉన్నాయి.

టూర్ మొదలైతే దోస్తులే

ఈ టూర్లలో మరో ప్రత్యేకత ఉంది. ఒకరికొకరు పరిచయం లేని మహిళలు టూర్ మొదలైన కొద్దిసేపటికే స్నేహితులుగా మారిపోతారు. వయసుతో సంబంధం లేకుండా అనుభవాలు పంచుకుంటూ, కలిసి ఆనందిస్తారు. కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ ఒత్తిళ్ల మధ్య తమ కోసం కాస్త సమయం కేటాయించుకోవాలనుకునే మహిళలకు ఈ టూర్లు ప్రత్యేక అనుభూతినిస్తున్నాయని హైదరాబాద్‌‌‌‌కు చెందిన డీ రాజేశ్వరి చెప్పారు. క్లబ్ సభ్యులతో కలిసి రెండోసారి కశ్మీర్ వెళ్లానని, ఒంటరి మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇచ్చారని వరంగల్‌‌‌‌కు చెందిన సృజన తెలిపారు. బస ఏర్పాట్లు సురక్షితంగా ఉన్నాయని రోహిణి, ఎన్.రేవతి చెప్పగా, టూర్‌‌‌‌తో కొత్త స్నేహాలు ఏర్పడ్డాయని స్మిత అన్నారు. భద్రతపై భరోసాతో కొత్త ప్రపంచంలోకి అడుగు.. ప్రతి మజిలీ ఓ కొత్త కథ! మహిళల కలలకు రెక్కలు కడుతూ ప్రతి ప్రయాణాన్ని మధురానుభూతిగా మారుస్తోంది హైదరాబాద్ లేడీస్ ట్రావెల్ క్లబ్.