సూది, దారంతో రంగురంగుల అల్లికలు.. ప్రతి కుట్టులోనూ బంజారా సంస్కృతి ప్రతిబింబం.. మహిళల చేతుల్లో ప్రాణం పోసుకుంటున్న అద్భుత కళారూపం భారూన్ ఎంబ్రాయిడరీ! తరతరాలుగా వస్తున్న ఈ కళకు ఆధునికతను జోడిస్తూ తెలంగాణ బంజారా మహిళలు స్వయం ఉపాధితో సాధికారతకు బాటలు వేస్తున్నారు. ఒకప్పుడు సంప్రదాయ దుస్తులకే పరిమితమైన భారూన్ కళ ఇప్పుడు చీరలు, దుపట్టాలు, బ్లౌజులు, బ్యాగులపై సరికొత్త అందాలు అద్దుతోంది. యంత్రాలతో పోటీపడుతూ చేతి పనితనంతోనే అద్భుతమైన వస్త్రాలు రూపొందిస్తున్న ఈ కళకు ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలు ప్రత్యేక చిరునామాగా నిలుస్తున్నాయి.
భారూన్ అంటే..
భారూన్ అంటే ‘నింపడం’ అని అర్థం. వస్త్రంపై రంగురంగుల దారాలతో దట్టంగా ఎంబ్రాయిడరీ చేయడమే దీని ప్రత్యేకత. రకరకాల ఆకారాలు, పూల డిజైన్లు, సంప్రదాయ ఆకృతులతో వస్త్రాలకు ప్రత్యేక ఆకర్షణ తీసుకొస్తారు. ఈ కళను ‘ఖచడి’ లేదా ‘భారూన్ కా బటువా’ అని కూడా పిలుస్తారు. పూర్తిగా చేతితో చేసే ఈ పనిలో కళాకారుల నైపుణ్యం, ఓర్పు, సృజనాత్మకతే కీలకం. లభానా తెగ మహిళలు ఈ కళను సంప్రదాయంగా కొనసాగిస్తున్నారని హైదరాబాద్ నిఫ్ట్ పరిశోధనలో వెల్లడైంది.
ఎలా తయారు చేస్తారంటే..
ఖాదీ వస్త్రం, పట్టు దారాలే ఈ కళకు ముడిసరుకు. రంగులు అద్దిన ఖాదీ వస్త్రాన్ని ‘ఖరువ’ లేదా ‘ఫడ్కి’ అంటారు. ఈ వస్త్రాన్ని చెక్క ఫ్రేమ్‌కు బిగించి, సూదితో పట్టు దారాలతో సున్నితంగా ఎంబ్రాయిడరీ చేస్తారు. ఒక్కో కుట్టు వెనుక గంటల శ్రమ ఉంటుంది. బ్లౌజులు, సంప్రదాయ నృత్య దుస్తులు, బటువా (డబ్బులు దాచుకునే సంచులు)తో పాటు అలంకరణ వస్తువులపైనా ఈ కళాకృతులు తీర్చిదిద్దుతారు.
శాంతాపూర్ ప్రత్యేకం
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని శాంతాపూర్, ధర్మసాగర్ గ్రామాలు భారూన్ ఎంబ్రాయిడరీకి ప్రధాన కేంద్రాలు. ఇక్కడి లభానా తెగ మహిళలు తరతరాలుగా ఈ కళను కొనసాగిస్తున్నారు. ఒకప్పుడు ఇంటి పనుల్లో భాగంగా సాగిన ఈ చేతివృత్తి ఇప్పుడు డిజైనర్ దుపట్టాలు, బ్లౌజులు, చీరల అంచులు, కుషన్ కవర్లు, హ్యాండ్ బ్యాగులకు కొత్త అందాలు అద్దుతోంది. దీంతో కొత్త మార్కెట్ ఏర్పడి మహిళలకు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని భారూన్ కళాకారిణి నిస్తే గీత చెప్పారు. జిల్లాలో ఇప్పటికీ 30 మంది మహిళలు ఈ కళను కొనసాగిస్తున్నారు. సబ్లే రుఖ్యాబాయి, నిస్తే గీతలను కేంద్ర హస్తకళల శాఖ భారూన్ కళాకారులుగా గుర్తించింది.
ప్రభుత్వ ప్రోత్సాహం
కేంద్ర హస్తకళల అభివృద్ధి పథకం కింద ఆదిలాబాద్ భారూన్, బంజారా ఎంబ్రాయిడరీలను చేర్చామని, ఈ కళ అంతరించిపోకుండా ప్రోత్సాహకాలు అందిస్తున్నామని తెలంగాణ స్టేట్ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సూపర్వైజర్ మహమ్మద్ అబ్దుల్ నజీర్ చెప్పారు. 2019లో హైదరాబాద్ నిఫ్ట్ నిజామాబాద్‌లో భారూన్ ఎంబ్రాయిడరీపై వర్క్‌షాప్ నిర్వహించిందని, అక్కడ 635 మంది కళాకారులతో బంజారా ఎంబ్రాయిడరీ క్లస్టర్, కామన్ ఫెసిలిటీ సెంటర్ ఉన్నాయని తెలిపారు. యంత్రాలు ఎన్ని డిజైన్లు సృష్టించినా చేతితో అల్లిన కళకు ఉండే ప్రత్యేకతే వేరు. సూది దారంతో సంప్రదాయాన్ని సజీవంగా ఉంచుతున్న ఈ మహిళల కళకు తగిన గుర్తింపు, ఆదరణ దొరికితేనే భారూన్ ఎంబ్రాయిడరీకి మరింత భవిష్యత్తు ఉంటుంది.
తండాల్లో సూదిపని
కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని తండాల్లో నివసించే మథుర కమ్యూనిటీ మహిళలు ఈ కళకు ప్రసిద్ధి. నేరల్తండా, పద్మలతండా, బీర్మల్తండా, మధురానగర్ తండా సహా గాంధారి, లింగంపేట, వర్ని మండలాల్లోని 20కి పైగా తండాల్లో మహిళలు భారూన్ వస్త్రాలు అల్లుతున్నారు. తమ తండాల మహిళలు తయారు చేసే భారూన్ వస్త్రాలకు ముంబైలోనూ డిమాండ్ ఉందని నేరల్తండా మాజీ సర్పంచ్ బిచ్చం నాయక్ చెప్పారు.
