‘ధర్మోపదేశ సమయే జనాః సర్వే 2 పి పండితాః
తదనుష్ఠాన సమయే మునయో 2 ప్యపండితాః’
‘‘ఇతరులకు నీతులు, ధర్మాలు, మంచి విషయాలు... ఉపదేశించేటప్పుడు లోకంలోని ప్రజలందరూ పండితుల్లాగ, జ్ఞానుల్లాగ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతుంటారు. కాని ఆ ధర్మాన్ని తాము స్వయంగా ఆచరించవలసి వచ్చేసరికి, గొప్ప గొప్ప మునులు, ఋషులు సైతం అజ్ఞానుల్లా ప్రవర్తిస్తారు.
ఈ శ్లోకం జీవిత సత్యాన్ని తెలియచెప్పే ఒక ప్రసిద్ధ సంస్కృత సుభాషితం. మానవ సహజమైన బలహీనతను తెలియచేస్తుంది. ‘చెప్పేవాడికి వినేవాడు లోకువ’, ‘చెప్పడానికే నీతులు’ అనే సామెతలు దీనికి సరిపోలుతాయి.
ఋషులు, మునులు, మహర్షులు.. వీరంతా కామక్రోధాలను జయించుతారని ప్రతీతి. కాని వారు కూడా దేనికీ అతీతులు కారని కొన్ని కథలు మనకు తెలియచేస్తున్నాయి. ఒకసారి విశ్వామిత్రుడు వశిష్ఠుని ఔన్నత్యాన్ని గ్రహించి, తాను కూడా ఆయనలాగ బ్రహ్మర్షి కావాలని సంకల్పించాడు.
అందుకు అనుకూలంగా తపస్సు చేయడం ప్రారంభించాడు. అతడి కఠోర దీక్షను చూసిన ఇంద్రుడు ఆయనకు తపోభంగం కలిగించాలనే ఉద్దేశంతో మేనకను పంపాడు. అంతటి ఋషి అయిన విశ్వామిత్రుడు ఇంద్రియ నిగ్రహం కోల్పోయాడు. మేనకతో కొంతకాలం గడిపాడు. ఫలితంగా శకుంతల జన్మించింది. అప్పుడు మేనక, ‘నేను వచ్చిన పని అయిపోయింది’ అని వెళ్లిపోయింది. తాను చేసిన తప్పేమిటో విశ్వామిత్రుడికి అర్థం అయింది. మరుక్షణం నిష్ఠతో మళ్లీ తపస్సు ఆరంభించాడు. ఈసారి పట్టువదలకుండా తపస్సు కొనసాగించాడు. ఎట్టకేలకు వశిష్ఠుని చేత, ‘నువ్వు బ్రహ్మర్షివి అయ్యావు’ అని అనిపించుకుని ఆ పదవిని అలంకరించాడు.
ఇటువంటిదే మహాభారతంలో కౌశిక మహర్షి కథ. కౌశిక మహర్షి తన శిష్యులకు, ఇతర జానపదులకు నిరంతరం నీతి బోధలు చేసేవాడు. క్రోధాన్ని జయించాలని పదేపదే వివరించేవాడు. ఒకసారి ఆ మహర్షి ఒక చెట్టు కింద కూర్చుని తపస్సు ఆచరిస్తున్నాడు. ఆ చెట్టు మీద ఉన్న కొంగ మహర్షి మీద రెట్ట వేసింది. కోపంతో కొంగను చూశాడు. ఆ కొంగ మాడిపోయింది. ఆ తరువాత కౌశికుడు భిక్షాటనకు బయలుదేరాడు. ఒక ఇంటిముందు నిలబడి ‘భవతీ భిక్షాందేహి’ అని అడిగాడు. ఆవిడ ఆ సమయంలో తన భర్తకు భోజనం వడ్డిస్తోంది.
ఆ పని పూర్తయ్యాక కౌశికుడికి భిక్ష తీసుకువచ్చింది. ఆలస్యం అయినందుకు కుశికుడు కోపించి, కళ్లు ఎర్రచేశాడు. అప్పుడు ఆ ఇల్లాలు, ‘మహర్షీ! నువ్వు కళ్లు ఎర్రచేస్తే, మాడిపోవడానికి నేను కొంగను కాదు’ అంది. ఈ విషయం ఈవిడకు ఎలా తెలిసిందో కౌశికుడికి అర్థం కాలేదు. ‘మహర్షీ! అన్నీ తెలిసిన మీ వంటి మహానుభావులు ఆగ్రహించడం తగునా. నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో మునిగి ఉన్నాను. అందువల్ల మీ భిక్ష ఆలస్యం అయింది. కోపాన్ని జయించనివారు మునులు, మహర్షులు ఎలా అవుతారు’ అని ప్రశ్నించింది. కౌశికుడు సిగ్గుపడిపోయాడు. తన తప్పు తాను తెలుసుకున్నాడు.
అనగనగా ఒక ఊరిలో మహాదేవుడు అనే ఒక పండితుడు ఉండేవాడు. అతడు ఆ ఊరిలో ఎవరికి ఏ సమస్య వచ్చినా, వారికి పరిష్కారం చెప్పి పంపేవాడు. ఒకనాడు ఆయన దగ్గరకు కామయ్య అనే రైతు వచ్చి, ‘అయ్యా! మా పొలంలో దొంగలు పడి, పంట అంతా ఎత్తుకుపోయారు’ అని చెప్పాడు. అందుకు ఆ పండితుడు, ‘అంతా ఆ భగవంతుని లీల’ అని చెప్పి పంపేశాడు. ఈ సంఘటన జరిగిన కొంత కాలానికి ఆ పండితుడి పొలంలో దొంగలు పడి పంట అంతా దోచుకుపోయారు. పండితుడు లబోదిబోమంటున్నాడు.
అది చూసి, ‘అయ్యా! ఎందుకు ఏడుస్తున్నారు’ అంటూ అమాయకంగా ప్రశ్నించాడు కామయ్య. ‘నా పంటంతా దొంగలు దోచేశారు’ అన్నాడు. కామయ్య నవ్వుతూ, ‘అయ్యా! అంతా ఆ భగవంతుని లీల.. అని మీరు నాకు చెప్పారు కదయ్యా’ అన్నాడు. పండితుడు సిగ్గుతో తలవంచుకుని, ‘అన్నీ తెలిసిన నేనే ఇలా విలపిస్తున్నానేమిటి. నేను ఉపదేశం చేసేటప్పుడు మాత్రమే పండితుడినా? నీతులు చెప్పడానికే కాని, ఆచరించడానికి కాదన్నమాట’ అనుకున్నాడు. ఎవరికైనా నీతులు చెప్పడం తేలికే. ఆచరించడమే కష్టం.
డా. పురాణపండ వైజయంతి
మీరూ లైఫ్‌కి పిల్లల కథలు పంపాలి అనుకుంటున్నారా? అయితే.. కథను హామీపత్రంతోపాటు
[email protected] కి మెయిల్ చేయండి.
