రామాయణం పార్ట్ 1. సీత కత్తి  పట్టడమేంటి? 

రామాయణం పార్ట్ 1. సీత కత్తి  పట్టడమేంటి? 

రామాయణం అందరికీ తెలిసిన కథే. కానీ ఎన్నిసార్లు తెరకెక్కినా, ఈసారి ఎలా చూపించారనే ఆసక్తి సహజం. ‘ఆది పురుష్’పై వచ్చిన విమర్శల తర్వాత కొద్దికాలానికే రణ్‌‌‌‌బీర్ కపూర్, సాయిపల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో నితేశ్ తివారీ భారీ బడ్జెట్‌‌‌‌తో తీసిన ‘రామాయణం పార్ట్ 1’ ఆ ఆసక్తిని ఇంకా పెంచింది. రావణుడి తపస్సు, రాముడి విద్యాభ్యాసం నుంచి సీతాపహరణం, రామలక్ష్మణులు సీత జాడ వెతుక్కుంటూ బయల్దేరడం దాకా కథ వరుసగా సాగుతుంది.

 లంక, అయోధ్య, మిథిలా నగరాలు, రాజభవనాలు, రథాలు, ఆయుధాలు, పుష్పక విమానం డిజైన్ కట్టిపడేస్తాయి. జటాయువు రావణుడిని అడ్డుకునే సీన్, రాముడు సుడిగాలి సృష్టించే పోరాట దృశ్యాలు హైలైట్. రావణుడి తల్లి కైకసి (శోభన) పాత్రతో కథ మొదలుపెట్టడం, శూర్పణఖ భర్త విద్యుజ్జిహ్వుడి వల్లే పరోక్షంగా సీతాపహరణం జరిగిందని చూపించడం కొత్తగా అనిపిస్తాయి. పంకజ్ కుమార్ కెమెరా, ఏఆర్ రెహమాన్ నేపథ్య సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాయి.

సీత పోరాటం జీర్ణం కాదు

కానీ కొత్తదనం పేరుతో తీసుకున్న స్వేచ్ఛ కొన్నిచోట్ల ఇబ్బంది పెడుతుంది. అసుర సైన్యం వెంటాడుతుంటే రామలక్ష్మణులతో పాటు సీత పరుగులు తీయడం, కత్తి పట్టుకుని యుద్ధం చేయడం రామాయణం తెలిసిన ప్రేక్షకులకు ఒక్కసారిగా అంతుపట్టదు. ఖడ్గమృగాలు, సింహాలను వాహనాలుగా చూపించడం కూడా అదే కోవ. నీలమేఘశ్యాముడిగా చూస్తూ వచ్చిన రాముడిని సాధారణ రంగులో చూపించడం, తిలకం ముద్రలను పట్టించుకోకపోవడం కనిపిస్తాయి. ఎంట్రీలో రాముడిగా రణ్‌‌‌‌బీర్, సీతగా సాయిపల్లవి సెట్ కాలేదనిపించినా, తర్వాత ప్రేక్షకులు అలవాటుపడతారు. విభీషణుడి పాత్రను రిజిస్టర్ చేయకపోవడం, మండోదరిగా కాజల్‌‌‌‌ను వాడుకోకపోవడం, మనసుకు హత్తుకునే పాటలు లేకపోవడం, హనుమంతుడి ఎంట్రీకి ముందే పార్ట్ 1 ముగించడం నిరాశ కలిగిస్తాయి. చివరిగా.. కథనం పాత రామాయణ సినిమాల తరహాలోనే సాగినా, అద్భుతమైన విజువల్స్ కోసం ఒకసారి చూడొచ్చు.