రూ.5 వేల కోట్లు ఇవ్వండి.. భూగర్భ జలాల పెంపు, పరిరక్షణకు ప్రత్యేక నిధులు కావాలి

రూ.5 వేల కోట్లు ఇవ్వండి.. భూగర్భ జలాల పెంపు, పరిరక్షణకు ప్రత్యేక నిధులు కావాలి
  • ఎల్‌‌నినోను జాతీయ విపత్తుగా గుర్తించి తెలంగాణను ఆదుకోవాలి
  • సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రధానిని కోరామన్న మంత్రి ఉత్తమ్ 
  • యాసంగిలో వరి సాగు చేయవద్దని రైతులకు విజ్ఞప్తి

న్యూఢిల్లీ, వెలుగు: ఎల్‌‌నినో ప్రభావంతో తెలంగాణలో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని, వాటి పెంపు, పరిరక్షణకు రూ.5 వేల కోట్ల ప్రత్యేక ఆర్థిక సాయం అందించాలని ప్రధాని మోదీని కోరినట్లు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌‌ కుమార్‌‌ రెడ్డి తెలిపారు. ఎల్‌‌నినో ప్రభావాన్ని జాతీయ విపత్తుగా గుర్తించి తెలంగాణను ఆదుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. ఆదివారం ఢిల్లీలోని సీఎం అధికారిక నివాసం తుగ్లక్‌‌ రోడ్‌‌లో మరో మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.

మహారాష్ట్రలోని విదర్భ నుంచి దిగువన ఉన్న తెలంగాణ వరకు ఎల్‌‌నినో ప్రభావం తీవ్రంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో భూగర్భ జలమట్టాలు తగ్గుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలాల తగ్గుదలకు సంబంధించిన గణాంకాలను ప్రధానికి వివరించినట్లు చెప్పారు. కేంద్ర భూగర్భ జల మండలి 2026 సెప్టెంబర్‌‌ నివేదికతో పాటు రాష్ట్రంలోని అన్ని రెవెన్యూ గ్రామాల్లో భూగర్భ జలాలను పెంచేందుకు, పరిరక్షించేందుకు రూపొందించిన స్వల్ప, దీర్ఘకాలిక కార్యాచరణ ప్రణాళికలను సమర్పించినట్లు వెల్లడించారు. ప్రతి అంశాన్నీ ప్రధాని ఓపికగా విని, వివరాలు అడిగి తెలుసుకున్నారని, రాష్ట్ర విజ్ఞప్తులను పరిశీలిస్తామని సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు.

నీటి నిల్వలున్నాయి.. 

వచ్చే వానాకాలం వరకు తాగునీటి అవసరాలకు సరిపడా నీటిని రిజర్వాయర్లలో నిల్వ ఉంచామని స్పష్టం చేశారు. హైదరాబాద్‌‌లో నీటి కష్టాలు వస్తాయంటూ విపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. మిషన్‌‌ భగీరథతో పాటు ఇతర మార్గాల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామని చెప్పారు. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ యాసంగిలో వరి సాగు చేయవద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు.

మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తిపోయలేం..

తెలంగాణ నుంచి ఒక్క చుక్క నీరు కూడా ఏపీకి వెళ్లలేదని ఉత్తమ్‌‌ స్పష్టం చేశారు. దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల వద్ద గోదావరి నీటిని ఒడిసిపట్టామని తెలిపారు. నీటి తరలింపుపై విపక్షాలు చేస్తున్న విమర్శలను ఆయన తప్పుబట్టారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో ఒకే తరహా సీకెంట్‌‌ పైల్‌‌ పునాదులు ఉన్నాయని, వాటి రూపకల్పన, నిర్మాణంలో లోపాలు ఉన్నట్లు నిపుణులు లిఖితపూర్వకంగా పేర్కొన్నారని చెప్పారు.

మేడిగడ్డ బ్యారేజీని నిర్మించిన గత ప్రభుత్వ హయాంలోనే అది దెబ్బతిన్నదని విమర్శించారు. ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడి నుంచి నీటిని ఎత్తిపోయే అవకాశం లేదని నిపుణులు స్పష్టం చేశారని తెలిపారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు రూ.11 వేల కోట్లు ఖర్చు చేసి, 30 శాతం పనులు పూర్తయ్యాక తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టును మళ్లించారని ఆరోపించారు. కమీషన్ల కోసమే గత ప్రభుత్వం ఈ మార్పు చేసిందని విమర్శించారు. దిగువకు ప్రవహిస్తున్న గోదావరి జలాలను ప్రస్తుతం దేవాదుల, సీతారామ ఎత్తిపోతల పథకాల ద్వారా వినియోగిస్తున్నామని వివరించారు.

సమ్మక్క-సారలమ్మ ఎన్‌‌ఓసీపై 17న ఛత్తీస్‌‌గఢ్‌‌కు..

సమ్మక్క సారలమ్మ బ్యారేజీ నిర్మాణం పూర్తయిందని, హైడ్రాలజీ అనుమతి కూడా వచ్చిందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. బ్యారేజీని పూర్తి సామర్థ్యంతో వినియోగించేందుకు చత్తీస్‌‌గఢ్‌‌ ఎన్‌‌ఓసీ జారీని వేగవంతం చేయాలని ప్రధానిని కోరినట్లు చెప్పారు. “చత్తీస్‌‌గఢ్‌‌ కోరిన మేరకు ఐఐటీ ఖరగ్‌‌పూర్‌‌ నుంచి ముంపు నివేదిక తెప్పించాం. అదనపు డీపీఆర్‌‌ కోసం కోరిన సొమ్ము జమ చేశాం. ముంపునకు పరిహారం చెల్లించేందుకు సిద్ధమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇప్పటికే తెలిపాం” అని వివరించారు.

“సమ్మక్క- సారలమ్మ డీపీఆర్‌‌ను సమర్పించిన తర్వాత సాంకేతిక సలహా కమిటీ అనుమతికి సంబంధించిన మార్గదర్శకాలు మారాయి. డీపీఆర్‌‌ సమర్పించినప్పుడు అమల్లో ఉన్న నిబంధనల ప్రకారమే దాన్ని పరిశీలించాలని కోరాం. సమ్మక్క-సారలమ్మ ఎన్‌‌ఓసీ కోసం సోమవారం కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) చైర్మన్‌‌ను కలవనున్నం. రేపు (మంగళవారం) సీఎం రేవంత్‌‌ రెడ్డితో కలిసి చత్తీస్‌‌గఢ్‌‌కు వెళ్లి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చిస్తాం’ అని మంత్రి ఉత్తమ్​ తెలిపారు.