ఖమ్మం, వెలుగు: ప్రతి ఒక్కరిలో ఆరోగ్యంపై అవగాహన కల్పించడంతో పాటు గోదావరి పుష్కరాల ప్రచారం కోసం రన్నింగ్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ కు చెందిన సొసైటీ ఫర్ తెలంగాణ రన్నర్స్ ఆధ్వర్యంలో భద్రాచలంలో డిసెంబర్ 6న నిర్వహించనున్న ‘గోదావరి రివర్ మారథాన్’ పోటీల పోస్టర్‌ను ఖమ్మం క్యాంప్ ఆఫీస్‌లో ఆదివారం మంత్రి పొంగులేటి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గోదావరి పుష్కరాల ప్రాధాన్యతను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు భద్రాచలం ఆధ్యాత్మిక, పర్యాటక విశిష్టతను దేశవ్యాప్తంగా చాటిచెప్పేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయన్నారు. ఈ మారథాన్ పోటీల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన 1500 మందికి పైగా రన్నర్స్ తో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి మరో వెయ్యి మంది క్రీడాకారులు పాల్గొంటారని నిర్వాహకులు పన్నాల హరీశ్‌రెడ్డి తెలిపారు.
కొత్త పెన్షన్ల పంపిణీ..
సంక్షేమ పథకాలను పేదల గడపకు చేర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తిరుమలాయపాలెం మండలం బీరోలు, ఏదులపురం మున్సిపాలిటీ పరిధిలో కొత్త పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అంతకుముందు మున్సిపాలిటీలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. 8 ఏండ్ల కాలంలో గత ప్రభుత్వం ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని పొంగులేటి విమర్శించారు. కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు దారి మళ్లించారు తప్ప బీఆర్ఎస్ హయాంలో పేదలకు ఇళ్లు ఇవ్వలేదని విమర్శించారు. ప్రజా ప్రభుత్వంలో రూ.40,000 కోట్లతో ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తున్నామని వివరించారు.
