- హాజరుకానున్న మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ రాహుల్ రాజ్
- జిల్లాలో మార్కెట్ శాఖ ఆదాయానికి గండి, అధికారుల పాత్రపై తీవ్ర ఆరోపణలు
- నేడు సమావేశం తర్వాత కొందరిపై వేటు పడే అవకాశం!
ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మార్కెట్ శాఖకు రావాల్సిన సెస్ ఎగవేత, చెక్ పోస్టుల ఆదాయ దుర్వినియోగం, జీరో దందాల ఆరోపణలపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ రాహుల్ రాజ్ సోమవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. గత సంవత్సరాలతో పోలిస్తే మార్కెట్ శాఖ ఆదాయం గణనీయంగా తగ్గుముఖం పట్టడం, వ్యాపారులు సిండికేట్‌గా మారి మార్కెట్ సెస్, జీఎస్‌టీ ఎగవేస్తున్నారనే తీవ్ర విమర్శల నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
కోల్డ్ స్టోరేజ్ వ్యాపారులకు అక్రమంగా లబ్ధి చేకూరుస్తూ సొంత శాఖకు నష్టం కలిగిస్తున్న అధికారులపై డైరెక్టర్ విచారణ జరిపి శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉండటంతో ఉద్యోగ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. వచ్చే నెల 9న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానున్న న్యూ మోడల్ మార్కెట్ ఏర్పాట్లు, సత్తుపల్లిలో నిర్వహించనున్న మరో సమావేశంపై కూడా ఈ సందర్భంగా సమీక్ష జరుగనుంది. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ఎదురవుతున్న ఇబ్బందులు, మార్కెట్ ఫీజులు, వ్యాపార లావాదేవీల రికార్డులను డైరెక్టర్ స్వయంగా పరిశీలించనున్నారు. అక్రమాలకు పాల్పడినట్లు తేలిన అధికారులపై వేటు వేయడానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తుండటంతో, నేటి సమావేశం ఉమ్మడి ఖమ్మం జిల్లా మార్కెటింగ్ శాఖలో ప్రకంపనలు సృష్టిస్తోంది.
