పార్టీలకతీతంగా అర్హులందరికీ పింఛన్లు : మంత్రి దామోదర్ రాజనర్సింహ

పార్టీలకతీతంగా  అర్హులందరికీ పింఛన్లు : మంత్రి దామోదర్ రాజనర్సింహ

టేక్మాల్, వెలుగు: సంక్షేమం, అభివృద్ధి రెండు కండ్లుగా భావించే కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ పార్టీలకతీతంగా పింఛన్లు మంజూరు చేస్తోందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్​ రాజనర్సింహ అన్నారు. ఆదివారం మెదక్ జిల్లా టేక్మాల్ మండలం బొడ్మట్‌‌‌‌పల్లిలో అందోల్ నియోజకవర్గ పరిధిలోని టేక్మాల్, అల్లాదుర్గం, రేగోడ్ మండలాలకు చెందిన లబ్ధిదారులకు నూతన చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల నూతన పింఛన్లు మంజూరు చేయగా, మెదక్ జిల్లాలో 11 వేల పింఛన్లు మంజూరయ్యాయని తెలిపారు. ఇందులో టేక్మాల్, అల్లాదుర్గం, రేగోడ్ మండలాలకు 1,400 పింఛన్లు అందజేస్తున్నట్లు వెల్లడించారు. ఆర్థిక స్వావలంబన సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం మహిళా సంఘాలకు పెద్దఎత్తున ప్రోత్సాహం అందిస్తోందన్నారు. బ్యాంకు లింకేజీ లేకుండానే లక్షల రూపాయల రుణాలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. 

ఇందిరమ్మ క్యాంటీన్లు, పెట్రోల్ బంకులు, డ్రోన్ల నిర్వహణ వంటి రంగాల్లో మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి ఏటా 3,500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. టేక్మాల్, అల్లాదుర్గం, రేగోడ్ మండలాలకు 1,400 ఇండ్లు కేటాయించగా, ఇప్పటివరకు 400 ఇండ్ల నిర్మాణం పూర్తయిందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న పలు పథకాలను వివరించారు. టేక్మాల్, అల్లాదుర్గం, రేగోడ్, అందోల్‌‌‌‌, బొడ్మాట్ పల్లి వంటి వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ఇన్​చార్జి  కలెక్టర్  ప్రతీక్ జైన్, డీ ఆర్ వో అంబదాస్ రాజేశ్వర్, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీ ఆర్ డీ వో శ్రీనివాసరావు, టేక్మాల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.