గాంధారి ఖిల్లాపై ట్రెక్కింగ్..ఉత్సాహంగా పాల్గొన్న మంచిర్యాల జిల్లా రన్నర్స్

గాంధారి ఖిల్లాపై ట్రెక్కింగ్..ఉత్సాహంగా పాల్గొన్న మంచిర్యాల జిల్లా రన్నర్స్

కోల్​బెల్ట్, వెలుగు : మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బొక్కలగుట్ట పంచాయతీ పరిధిలోని చారిత్రత్మాక గాంధారీఖిల్లాపై ఆదివారం మందమర్రి రన్నర్స్​ ఆధ్వర్యంలో ట్రెక్కింగ్​ నిర్వహించారు. మంచిర్యాల, మందమర్రి, బెల్లంపల్లి ప్రాంతాలకు చెందిన పలువురు రన్నర్స్, వాకర్స్ క్లబ్ సభ్యులు ఉత్సాహంగా ట్రెక్కింగ్​లో పాల్గొన్నారు. ఆరు కిలోమీటర్ల మేర ఈ ట్రెక్కింగ్ కొనసాగింది. ఎత్తైన, క్లిష్టమైన గుట్టలపై సాగిన ఈ సాహసయాత్రలో సభ్యులు పలు సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగారు. 

గాంధారి ఖిల్లా చారిత్రక నేపథ్యం, ప్రాచీన విశిష్టత, ప్రకృతి రమణీయతను తెలుసుకుంటూ ట్రెక్కింగ్ చేపట్టారు. ఖిల్లాలోని అన్ని ముఖ్యమైన ప్రాంతాలను సందర్శించి ప్రకృతి అందాలను ఆస్వాదించారు. మంచిర్యాల జిల్లాలో గాంధారి ఖిల్లాకు ప్రత్యేకమైన చారిత్రక ప్రాధాన్యత ఉందని, ప్రకృతి అందాలతో అలరించే ఈ ప్రాంతాన్ని మరింత మందికి పరిచయం చేయాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు. భవిష్యత్​లో భారీ ట్రెక్కింగ్ నిర్వహణకు రూట్ మ్యాపింగ్ చేసే చాన్స్ వచ్చిందన్నారు. గాంధారి ఖిల్లా చారిత్రక వైభవాన్ని, ప్రకృతి అందాలను బాహ్య ప్రపంచానికి పరిచయం చేస్తే మంచిర్యాల జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.