కార్పొరేట్లకు వేల కోట్లు.. రైతులకు6 వేలా? కేంద్రాన్ని ప్రశ్నించిన సీపీఎం మాజీ ఎంపీ బృందాకారత్

కార్పొరేట్లకు వేల కోట్లు.. రైతులకు6 వేలా? కేంద్రాన్ని ప్రశ్నించిన సీపీఎం మాజీ ఎంపీ బృందాకారత్
  • తెలంగాణ పోరాటానికి మతతత్వ రంగు పులమొద్దని వార్నింగ్
  • రైతు సమస్యలు పరిష్కరించకుంటే.. 
  • లక్ష మందితో మహా పాదయాత్ర: విజూ కృష్ణన్ 
  • నల్గొండలో ఏఐకేఎస్ జాతీయ 
  • మహాసభలు ప్రారంభం

నల్లగొండ/హైదరాబాద్, వెలుగు: వ్యవసాయ రంగాన్ని దేశీయ, విదేశీ కార్పొరేట్లకు, అమెరికాకు ప్రధాని మోదీ ప్రభుత్వం తాకట్టు పెడుతోందని సీపీఎం జాతీయ నేత, మాజీ ఎంపీ బృందాకారత్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అండతో అదానీ రోజుకు సగటున రూ.వెయ్యి కోట్లు సంపాదిస్తుంటే.. రైతులకు ఏడాదికి రూ.6 వేలు ఇచ్చి గొప్ప ఉపకారం చేసినట్లు ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. రైతులకు ఇచ్చే డబ్బు మీ కుటుంబ ఆస్తి కాదని, ప్రజల సొమ్మని స్పష్టం చేశారు. 

దేశంలో కార్పొరేట్, మతతత్వ ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలని రైతులకు పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కాలేజీ గ్రౌండ్‌‌‌‌లో అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) 36వ జాతీయ మహాసభల సందర్భంగా ఆదివారం బహిరంగ సభ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభకు ముఖ్యఅతిథిగా బృందాకారత్ హాజరయ్యారు. ఆదివాసీ వీరుడు బిర్సా ముండా 151వ జయంతి సందర్భంగా 'జల్, జంగల్, జమీన్' కోసం ఆయన చేసిన పోరాటానికి నివాళులర్పించారు.

తెలంగాణ పోరాటాన్ని వక్రీకరించొద్దు..

మూడు వ్యవసాయ చట్టాలపై రైతులు వెనక్కి తగ్గించినా మోదీ సర్కార్ తీరు మారలేదని బృందాకారత్ విమర్శించారు. దేశంలోని కాశ్మీర్ నుంచి కేరళ, పున్నప్ర-వయలార్, సుర్మా లోయ, తేభాగా, వార్లీ, పంజాబ్ పోరాటాలకు కిసాన్ సభ ఎర్రజెండానే నాయకత్వం వహించిందని, ఈ తిరుగుబాట్లకు నల్లగొండ గడ్డ కేంద్ర బిందువని  తెలిపారు. నల్లగొండ సాయుధ పోరాటం నిజాం, రజాకార్లకు అండగా ఉన్న భూస్వాముల వెట్టిచాకిరీ నుంచి 3 వేలకు పైగా గ్రామాలను విముక్తి చేసి, 'దున్నేవాడికే భూమి' హక్కులను సాధించిందన్నారు. 

ఈ చరిత్రాత్మక పోరాటాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్.. హిందూ-ముస్లిం ఘర్షణగా వక్రీకరించి మతతత్వ రంగు పులమాలని చూస్తే సహించబోమని హెచ్చరించారు. నాడు నిజాంకు మద్దతిచ్చిన భూస్వాముల్లో అత్యధికులు హిందువులేనని, ఇది కులమతాలకు అతీతంగా సాగిన లౌకిక వర్గ పోరాటమని స్పష్టం చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ 12 ఏండ్ల పాలనలో 1.5 లక్షల మంది రైతులు, వ్యవసాయాధారిత కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసరాల ధరలు రెట్టింపవుతుంటే యుద్ధాన్ని సాకుగా చూపుతూ తప్పించుకుంటున్నారని తెలిపారు. చమురు సంక్షోభానికి బాధ్యులైన ట్రంప్‌‌‌‌తో మోదీ చేతులు కలపడం సిగ్గుచేటని విమర్శించారు.

ఆదివాసీలకు ప్రజాస్వామ్యం ఎక్కడ..?

అభివృద్ధి ప్రాజెక్టుల పేరుతో 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వకుండా లక్షలాది హెక్టార్ల భూములను లాక్కుంటున్నారని, దీంతో ఆదివాసీలే తీవ్రంగా నష్టపోతున్నారని బృందాకారత్ ఆరోపించారు. తెలంగాణలో పోలవరం ప్రాజెక్టుతో వేలాది మంది ఆదివాసీలు నిర్వాసితులయ్యారని, పోడు సాగుదారులకు పట్టాలివ్వకుండా అటవీ హక్కుల చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. ‘ఆదివాసీలకు ప్రజాస్వామ్యం ఎక్కడ? గ్రామసభల హక్కులు ఏమయ్యాయి?’ అని సీఎం రేవంత్‌‌‌‌రెడ్డిని ప్రశ్నించారు. తెలంగాణలో ఎఫ్‌‌‌‌ఆర్‌‌‌‌ఏను తక్షణమే అమలు చేయాలని, ఆదివాసీలను ఆక్రమణదారులుగా చూసి ఖాళీ చేయించడం ఆపాలని డిమాండ్​చేశారు.

రైతు సమస్యలు తీర్చకుంటే లక్ష మందితో పాదయాత్ర: విజూ కృష్ణన్

తెలంగాణలో రైతు సమస్యలను 2 నెలల్లో పరిష్కరించాలని, లేదంటే సూర్యాపేట నుంచి హైదరాబాద్ వరకు లక్ష మంది రైతులతో మహాపాదయాత్ర చేపడతామని ఏఐకేఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్రంలోని 365 మండలాల్లో కరువున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

రూ.50 వేల కోట్ల పరిహారం తేవాలి..

రాష్ట్రంలో 365 కరువు మండలాలను ప్రకటించినా సహాయక చర్యలు లేవని తెలంగాణ రైతు సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పోతినేని సుదర్శన్ రావు, తీగల సాగర్ ఆందోళన వ్యక్తం చేశారు. అఖిలపక్షంతోపాటు తెలంగాణకు చెందిన 8 మంది బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఒత్తిడి తెచ్చి కేంద్రం నుంచి రూ.50 వేల కోట్ల పరిహారం తేవాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలు మారకపోతే పాలకులను గద్దె దించడానికి వెనుకాడబోమని హెచ్చరించారు. 

‘ఎర్ర’గొండగా నల్గొండ..

ఏఐకేఎస్ 36వ జాతీయ మహాసభల సందర్భంగా ఆదివారం నల్గొండ పట్టణం ‘ఎర్ర’గొండగా మారింది. మహాసభల ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని నగర శివారు మర్రిగూడ బైపాస్ సెంటర్ నుంచి ఎన్జీ కాలేజ్ ప్రాంగణం వరకు సుమారు 4 కిలోమీటర్ల మేర నిర్వహించిన రైతుల మహా ప్రదర్శనను ఏఐకేఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్ జెండా ఊపి ప్రారంభించారు. వేలాదిగా తరలివచ్చిన రైతులు, వ్యవసాయ కార్మికులు, మహిళలు, యువత, విద్యార్థులు ఎర్రజెండాలు చేతబట్టి కదం తొక్కారు. 

రెడ్ షర్ట్ వాలంటీర్ల కవాతు, థింసా, లంబాడీ నృత్యాలు, కోయడప్పు, మహిళల కోలాటాలు ఆకర్షణగా నిలిచాయి. ఆహ్వాన సంఘం అధ్యక్షుడు జూలకంటి రంగారెడ్డి, కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జాన్ వెస్లీ తదితరులు ఎడ్లబండ్లపై ర్యాలీగా ప్రదర్శనకు వచ్చారు. ఈ ప్రదర్శనలో మాజీ ఎంపీ బృందాకారత్, ఏఐకేఎస్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ అశోక్ ధావలే, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పోతినేని సుదర్శన్ రావు, తీగల సాగర్, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.