- వరుసగా రెండో టైటిల్ సొంతం
కుమమోటో (జపాన్): ఇండియా స్టార్ షట్లర్ లక్ష్య సేన్ మరోసారి అంతర్జాతీయ వేదికపై మెరిశాడు. ఆదివారం జరిగిన కుమమోటో మాస్టర్స్ జపాన్ ఓపెన్ (సూపర్ 500) పురుషుల సింగిల్స్ ఫైనల్లో స్థానిక ఫేవరెట్ కోకి వటనాబేపై గెలుపొంది టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. 64 నిమిషాల పాటు ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో తొలి గేమ్‌ను కోల్పోయినప్పటికీ ఆ తర్వాత పుంజుకున్నాడు. వరుసగా రెండు గేమ్‌లలో ఆధిపత్యం చెలాయించి 13–-21, 21-–18, 21–-14 తేడాతో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా జపాన్ మాస్టర్స్ మెన్స్ టైటిల్ సాధించిన తొలి ఇండియన్ గా చరిత్ర సృష్టించాడు. దీంతో హ్యాంగ్జౌలో జరిగే సీజన్ ముగింపు టోర్నీ 'బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్'కు అర్హత సాధించే స్థానంలోకి దూసుకెళ్లాడు. కాగా.. ఇటీవల హైలో ఓపెన్ టైటిల్ ను కూడా లక్ష్య సేన్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానానికి..
ఈ టోర్నీకి ముందు ‘రేస్ టు ఫైనల్స్’ పట్టికలో ఎనిమిదో సీడ్ లక్ష్యసేన్ 64,980 పాయింట్లతో 12వ స్థానంలో ఉన్నాడు. వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు అర్హత సాధించాలంటే టాప్-8లో నిలవాలి. తాజా విజయంతో లక్ష్యసేన్‌కు 9,200 పాయింట్లు దక్కాయి. దీంతో మంగళవారం విడుదలయ్యే కొత్త ర్యాంకింగ్స్‌లో అతను 74,180 పాయింట్లతో ఆరో స్థానానికి చేరుకోనున్నాడు. అయితే, నవంబర్ 17 నుంచి 22 వరకు జరిగే హాంకాంగ్ ఓపెన్ ఈ అర్హత రేసులో చివరి టోర్నీ కావడంతో లక్ష్యసేన్ ప్రదర్శనపై ఆసక్తి నెలకొంది.
