- కవ్వాల్‌లోకి 2015 నుంచి 15 పులులు వలస
- 2025 చివరి నుంచి మరో 8 పులులు ఎంట్రీ
- 2026 ఆగస్టులో ఇంకో రెండు పెద్ద పులులు
- అమ్రాబాద్‌లో 12 నుంచి 42కు పెరుగుదల
- ఇక్కడే ఉండాలంటే ఆహారం, భద్రత తప్పనిసరి
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ అడవుల్లోకి పొరుగు రాష్ట్రాల పెద్దపులులు క్యూ కడుతున్నాయి. అటు మహారాష్ట్ర, ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇటీవలి కాలంలో టైగర్ల రాకపోకలు పెరిగాయి. తమకంటూ సొంత ఆవాసాన్ని ఏర్పాటు చేసుకోవడానికో.. లేక తోడు కోసమో సరిహద్దులు దాటుతున్నట్లు వన్యప్రాణి నిపుణులు చెబుతున్నారు. అయితే, పెద్దపులులకు రక్షణ కల్పించడంలో అటవీశాఖ ఆఫీసర్లు విఫలమవుతున్నారన్న
విమర్శలున్నాయి.
రెండు వైపుల నుంచి రాక
రాష్ట్ర అభయారణ్యాలలోకి పెద్దపులులు రెండు వైపుల నుంచి ప్రవేశిస్తున్నాయి. ఉత్తర తెలంగాణలోకి మహారాష్ట్రలోని తడోబా– అంధేరి, తిప్పేశ్వర్ అభయారణ్యాల నుంచి వస్తున్నాయి. అక్కడ పులుల సంఖ్య పెరగడంతో యంగ్టైగర్లు ప్రాణహిత, పెన్‌గంగ నదులను దాటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్ అడవుల్లోకి చేరుతున్నాయి. అక్కడి నుంచి మంచిర్యాల, నిర్మల్ జిల్లాల మీదుగా
భూపాలపల్లి, ములుగు జిల్లాలోని ఏటూరునాగారం వరకు కొన్నిసార్లు జనావాసాల పక్కనుంచే సిద్దిపేట, యాదాద్రి జిల్లాల వరకు సంచరిస్తున్నాయి. మరోవైపు దక్షిణ తెలంగాణలో ఏపీలోని నల్లమల (నాగార్జునసాగర్–శ్రీశైలం పులుల అభయారణ్యం) నుంచి కృష్ణా నదిని దాటి నాగర్‌కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ అభయారణ్యంలోకి.. అక్కడి నుంచి నల్గొండ సరిహద్దుల్లోకి ఎంటర్ అవుతున్నాయి.
అలాగే, ఏపీలోని పాపికొండలు, చత్తీస్‌గఢ్ సరిహద్దుల నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీ ప్రాంతాల్లోకి పులులు ప్రవేశిస్తున్నాయి. కాగా, వేటగాళ్లు, అడవి పందుల బారినుంచి పంటలను కాపాడుకునేందుకు రైతులు పొలాల్లో అమర్చిన కరెంట్‌వైర్లు, ఉచ్చుల్లో చిక్కుకుని, పశువుల కళేబరాలపై విషప్రయోగంతో పులులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలున్నాయి.
ఆహారం, భద్రత కల్పిస్తేనే శాశ్వత నివాసం
సరిహద్దులు దాటి వస్తున్న పెద్దపులులు మన అడవుల్లోనే శాశ్వతంగా ఉండిపోయి, వాటి సంతతి పెరగాలంటే అటవీశాఖ పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని వన్యప్రాణి సంరక్షకులు సూచిస్తున్నారు. పులులు ఒకచోట స్థిరపడాలంటే వాటికి సరిపడా ఆహార జంతువులు(ప్రే బేస్) అందుబాటులో ఉండాలని, అందుకోసం అడవుల్లో గడ్డి మైదానాలను అభివృద్ధి చేసి దుప్పులు, కణితులు, సాంబార్ల సంఖ్యను వృద్ధి చేయాలని చెప్తున్నారు. వేసవిలోనూ నీటి కొరత లేకుండా సోలార్ పంపులతో నీటి తొట్టెలను నింపడంతోపాటు పులులు ప్రయాణించే కారిడార్లలో రహదారులు, మైనింగ్ వంటి ఆటంకాలు లేకుండా చూడాలంటున్నారు.
కోర్ ప్రాంతాల్లో పశువుల మేతను, అక్రమ కలప రవాణాను అరికట్టాలని పేర్కొంటున్నారు. అటవీ సరిహద్దు గ్రామాల్లో తనిఖీలు చేపట్టి, పొలాల చుట్టూ విద్యుత్ కంచెలను, వేటగాళ్ల ఉచ్చులను తొలగించాలని, బాధ్యులపై కేసులు నమోదు చేయాలని కోరుతున్నారు. ఖాళీగా ఉన్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ల పోస్టులను వెంటనే భర్తీ చేసి, పులుల కదలికలను ఎప్పటికప్పుడు గుర్తించేందుకు ట్రాప్ కెమెరాలు, డ్రోన్లు, కాలర్ ఐడీల వంటి ఆధునిక టెక్నాలజీని వినియోగించాలని చెప్తున్నారు. పులుల దాడిలో పశువులు చనిపోయినప్పుడు జాప్యం లేకుండా రైతులకు పరిహారం అందించాలంటున్నారు.
అమ్రాబాద్‌లో 42 పులులు
మహారాష్ట్ర(2015) నుంచి ఇప్పటివరకు కవ్వాల్ కోర్ ప్రాంతంలోకి 15 వలస పులులు ప్రవేశించినట్లు తేలింది. ఆదిలాబాద్, కాగజ్‌నగర్, కవ్వాల్ కారిడార్ల పరిధిలోకి 2022 నాటికి 22 పులులు రాకపోకలు సాగించాయి. 2025 చివరి నుంచి ఇప్పటివరకు తడోబా, తిప్పేశ్వర్ నుంచి మరో 5 నుంచి 8 పెద్దపులులు ఉత్తర తెలంగాణలోకి వచ్చాయి. 2026 ఆగస్టులోనూ మరో 2 పెన్‌గంగ, ప్రాణహిత నదులను దాటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోకి ప్రవేశించాయి.
మరోవైపు నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ నుంచి అధికారికంగా 4 పులులు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లోకి ఎంటరయ్యాయి. అమ్రాబాద్‌లో రక్షణ చర్యలు సత్ఫలితాలివ్వడంతో 2020లో 12గా ఉన్న పులుల సంఖ్య 2026 అఖిల భారత పులుల గణన నాటికి 42కు చేరింది. నల్గొండ జిల్లా అటవీ భాగంలోనూ ఒక పులి స్థిరపడగా.. మరో రెండు పులులు రాకపోకలు సాగిస్తున్నాయి. వీటికి తోడు ఏపీ పాపికొండలు, చత్తీస్‌గఢ్ సరిహద్దుల నుంచి భద్రాద్రి కొత్తగూడెం అడవుల్లోకి 1 నుంచి 2 పులుల కదలికలు నమోదవుతున్నాయి.
