ఎల్‌‌‌‌ నినో ను ఎదుర్కొందాం..ఇసుక బస్తాలతో నీటి నిల్వ పనులు స్పీడప్చేయాలి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఎల్‌‌‌‌ నినో ను ఎదుర్కొందాం..ఇసుక బస్తాలతో నీటి నిల్వ పనులు స్పీడప్చేయాలి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
  •     మూడు జిల్లాలకు మంచినీటిని అందించాలి
  •     సీతమ్మ సాగర్ పూర్తయితే 350 మెగావాట్ల విద్యుత్,36 టీఎంసీల నీటి నిల్వ
  •     మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

మణుగూరు/ దమ్మపేట, వెలుగు: ఎల్‌‌‌‌నినో ప్రమాదాన్ని సరైన ప్రణాళికతో సమర్థంగా ఎదుర్కొందామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఆదివారం అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి గ్రామం వద్ద దుమ్ముగూడెం ఆనకట్టపై నిర్మిస్తున్న తాత్కాలిక నీటి నిల్వ పనులను ఆయన పరిశీలించారు. వేసవిలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా మూడు జిల్లాలకు తాగునీరు అందించేందుకు నిలువ సామర్థ్యాన్ని పెంచేందుకు కట్ట ఎత్తు పెంపు పనులు వేగంగా చేయాలని అధికారులకు సూచించారు. 

సీతమ్మసాగర్ ప్రాజెక్టు పూర్తయితే దుమ్ముగూడెం వద్ద సుమారు 36 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంటుందని, దీంతో 350 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి తో పాటు ఉమ్మడి ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు నీటిని అందించవచ్చని చెప్పారు. సమ్మక్క సారలమ్మ బ్యారేజీ వద్ద అదనంగా మూడు నుంచి నాలుగు టీఎంసీల నీటిని నిలువ చేసుకునే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నామని, ఇందుకోసం పొరుగు రాష్ట్రాలతో చర్చలు జరపనున్నట్టు తెలిపారు.  కార్యక్రమంలో భద్రాచలం సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట, అడిషనల్ కలెక్టర్ విద్యా చందన తోపాటు పలువురు ఇరిగేషన్ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

కొండరెడ్ల గ్రామాల అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక

కొండరెడ్డి, గుత్తికోయ గిరిజన గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు సూచించారు. దమ్మపేట మండలం పూసుకుంటలో పూసుకుంట, కాటుకూరు గ్రామాలకు చెందిన కొండరెడ్డి గిరిజనుల జీవన పరిస్థితులు, గ్రామాల అభివృద్ధిపై ఆదివారం అధికారులతో సమీక్షించారు. గ్రామ సర్పంచ్ రాజిరెడ్డి, అడిషనల్​ కలెక్టర్లు డి. వేణుగోపాల్, విద్యా చందన, ఐటీడీఏ ఏపీఓ జనరల్ డేవిడ్ రాజు హాజరయ్యారు. అటవీ సంపదను పరిరక్షిస్తూనే గిరిజనులకు స్థిరమైన ఆదాయం కల్పించేలా ఉద్యానవన పంటలు, ఆయిల్​ పామ్, జీడిమామిడి, వెదురు, మునగ వంటి పంటల సాగును ప్రోత్సహించాలని మంత్రి సూచించారు. గిరిజనుల భూములు అన్యాక్రాంతం కాకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. 

పూసుకుంట, కట్టుకూరు గ్రామాలకు రోడ్డు వేసేందుకు గతంలో రూ.20 కోట్లు మంజూరు లభించిందని, ఒక్క చెట్టును కూడా తొలగించకుండా ఇప్పుడున్న మార్గంలోనే కొత్త రోడ్డు నిర్మించాలని చెప్పారు. గ్రామంలోని పిల్లలంతా స్కూలుకు వచ్చేలా చూడాలన్నారు. గ్రామంలో ప్రతి పది రోజులకు ఒకసారి వైద్య శిబిరాలు నిర్వహించాలని, ఆరోగ్య ఉపకేంద్రం ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలని సూచించారు. కొత్తగా మంజూరైన చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను మంత్రి లబ్ధిదారులకు అందజేశారు.