పాల్వంచ, వెలుగు : ప్రమాదవశాత్తు కార్మికుడు మృతి చెందిన సంఘటన భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని కొత్తగూడెం ధర్మల్ పవర్ స్టేషన్ ఏడవ దశ సూపర్ క్రిటికల్ యూనిట్ లో ఆదివారం జరిగింది. కేటీపీఎస్ చీఫ్ ఇంజినీర్ ఎం ప్రభాకర్ రావు, టౌన్ ఎస్సై నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని వెంకటేశ్వర హిల్స్ కాలనీలో నివాసం ఉండే పెంబుల వెంకటేశ్వర్లు (42)మొదటి షిఫ్ట్ డ్యూటీకి వెళ్లి బీవో బీఆర్ బొగ్గు వ్యాగన్ నుంచి బొగ్గు ను దిగుమతి చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి వ్యాగన్ కు వ్యాగన్ టిప్లర్ కు మధ్యలో ఇరుక్కుపోయాడు.
దీంతో తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు కేటీపీఎస్ వైద్యశాలకు తరలిస్తుండగా చనిపోయాడు. మృతుడికి భార్య రమణ, కుమార్తె దుర్గా సాహితి, కుమారుడు సాయి ఉన్నారు. ఈ మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
