- 10 ట్రాక్టర్ల ఇసుక సీజ్
కోటపల్లి, వెలుగు : మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో అక్రమ ఇసుక నిల్వలపై అధికారులు చర్యలకు దిగారు. మండలంలోని రాపనపల్లి గ్రామ శివారులో ఉన్న అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు సమీపంలోని ఓ సిమెంట్ బ్రిక్స్ తయారీ కేంద్రంలో అక్రమంగా నిల్వ ఉంచినట్టు సమాచారం అందడంతో పోలీసులు, రెవెన్యూ, మైనింగ్ శాఖ అధికారులు కలిసి తనిఖీలు నిర్వహించారు. 10 ట్రాక్టర్ల లోడ్ ఇసుక నిల్వలను గుర్తించి సీజ్ చేశారు. ఇసుకను అక్రమంగా నిల్వ చేయడం, అనుమతులు లేకుండా తరలించడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
చెన్నూరు నియోజకవర్గంలో ఇసుక అక్రమ తవ్వకాలు, నిల్వలు, రవాణాను అరికట్టేందుకు మంత్రి వివేక్ వెంకటస్వామి అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో తనిఖీలు నిర్వహించి అక్రమ నిల్వలను సీజ్ చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
