బలహీన వర్గాలను విడదీసే కుట్రలను అడ్డుకోవాలి : ఎంపీ వంశీకృష్ణ

బలహీన వర్గాలను విడదీసే కుట్రలను అడ్డుకోవాలి : ఎంపీ వంశీకృష్ణ
  •     ఐకమత్యంతోనే అభివృద్ధి సాధ్యం: ఎంపీ వంశీకృష్ణ
  •     బాలానగర్‌‌లో అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ

కూకట్‌‌పల్లి, వెలుగు: సమాజంలోని బలహీన వర్గాలను విడదీసే కుట్రలను అడ్డుకుని, ఐకమత్యంతో ముందుకు సాగాలని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ పిలుపునిచ్చారు. ప్రజలంతా ఒక్కటిగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ఆదివారం సాయంత్రం బాలానగర్‌‌లో డబుల్ బెడ్‌‌రూమ్ అంబేద్కర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అంబేద్కర్ రాజ్యాంగంలో ఆర్టికల్ 14, 15, 21, 22లను పొందుపరిచారని తెలిపారు. 

ఆయన ఆశయాలకు అనుగుణంగా అన్ని వర్గాలను సమానంగా చూడాలని, ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. సమాజ ఐక్యత కోసం అంబేద్కర్ చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ విగ్రహావిష్కరణ కార్యక్రమాలకు హాజరవుతున్నట్లు చెప్పారు. తన తాత కాకా, తండ్రి వివేక్ వెంకటస్వామి అడుగుజాడల్లో రాజకీయాల్లో కొనసాగుతున్నానన్నారు. గిగ్ వర్కర్ల సంక్షేమ చట్టం కోసం మంత్రి వివేక్ చేసిన కృషిని వివరించారు. కూకట్‌‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ.. అన్ని వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చూపిన బాటలో నడవాలన్నారు. కూకట్‌‌పల్లి వై జంక్షన్ మెట్రో స్టేషన్‌‌కు అంబేద్కర్ పేరు పెట్టేందుకు కృషి చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు వెంగళరావు, రవీందర్‌‌రెడ్డి, స్థానిక నాయకులు శాకయ్య, శామ్యూల్, గౌతమ్, కృష్ణ  తదితరులు పాల్గొన్నారు.